Summer Camps: స్వేచ్ఛ బ్యూరో: రోజు రోజుకి యాంత్రికమైపోతున్న పట్టణ ప్రజలను క్రీడల వైపు మళ్లించేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వేసవి క్రీడా శిబిరాలను నిర్వహించనున్నారు. యువత, విద్యార్థులను క్రీడల పట్ల ఆసక్తి కల్గించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో ఈ నెల 25వ తేదీ నుంచి వేసవి శిబిరాలు మొదలై మే 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు, ఇందుకు కావల్సిన ఏర్పాట్లు తుది దశలో ఉన్నట్లు సమాచారం.
ఆరేళ్ల నుంచి 16 ఏళ్ల పిల్లలకు క్రీడా శిక్షణా
ఈ నెల 25న వేసవి శిబిరాలు మొదలై, అదే రోజు నుంచి వివిధ రకాల క్రీడాంశాల్లో తర్ఫీదునివ్వటంతో పాటు పోటీలను కూడా నిర్వహించనున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి క్యూర్ సిటీ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో వేరు వేరుగా సమ్మర్ క్యాంపులు జరగనున్నాయి. మొత్తం 44 రకాల క్రీడాంశాల్లో జీహెచ్ఎంసీ కోచ్ లు విద్యార్థులకు, ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆరేళ్ల నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని క్రీడల్లో కోచ్‌లతో శిక్షణ ఇప్పించనున్నారు. దీనివల్ల ప్రతి విద్యార్థి తమకు నచ్చిన క్రీడలో నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది.
భారీ స్థాయిలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులు
ఈ ఏడాది కార్పొరేషన్లలో విలీనమైన 27 లోకల్ బాడీల పరిధిలోని ఔత్సాహిక క్రీడాకారులు, క్రీడల పట్ల ఆసక్తి కల్గిన విద్యార్థులు మొదటిసారిగా ఈ సమ్మర్ క్యాంపులలో భాగస్వాములు కానున్నారు. దీని వల్ల శివారు ప్రాంతాల్లోని పిల్లలకు కూడా ఈ క్యాంపులు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో దాదాపు 2 లక్షల మంది ఈ శిక్షణకు వచ్చే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. శిక్షణ ఇచ్చేందుకు సుమారు 1500 మంది హనరరీ కోచ్(వేతనం లేకుండా) లను ఆయా కార్పొరేషన్ల అధికారులు నియమిస్తున్నారు. కోచింగ్ ఇచ్చినందుకుగాను వీరికి ఒక ట్రాక్ షూట్, షూజ్ ను కార్పొరేషన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్
జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లు నిర్వహించనున్న ఈ సమ్మర్ క్యాంపులకి సంబంధించి ఈ నెల 15వ తేదీ తరువాత నుంచి అప్లికేషన్లను ఆన్ లైన్ ద్వారా జీహెచ్ఎంసీ అధికారులు స్వీకరించనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు www.sports.ghmc.gov.in వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ క్యాంపుల్లో పాల్గొనే వారు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల పోర్టల్ లలో నమోదు చేసుకుని నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంది. షటిల్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, క్రికెట్, టెన్నీస్ క్రీడ లకు రూ. 50, మిగతా క్రీడలకు రూ.10 ఫీజుగా చెల్లించాల్సి ఉంది. క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ మెటీరియల్ కోసం మూడు చోట్ల కలిపి దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.
44 రకాల క్రీడాంశాల్లో శిక్షణ
సమ్మర్ క్యాంపుల్లో భాగంగా జీహెచ్ఎంసీతో పాటు ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లు నిర్వహించనున్న వేసవి క్రీడా శిబిరాల్లో మొత్తం 44 క్రీడాంశాల్లో కోచ్ లు శిక్షణనివ్వనున్నారు. వీటిలో అథ్లెటిక్స్, ఆర్చరి, బాల్ బాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా, నెట్ బాల్, రోలార్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నీస్, టెన్నీస్, టెన్నికాయిట్, తైక్వాండో, తగఫ్ వార్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ఇండియన్, రెజ్లింగ్ రోమన్, ఉషు, యోగా, త్రో బాల్, కిక్ బాక్సింగ్, మయ్ థాయ్, స్కే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్, క్యారమ్స్, చెస్ గేమ్స్ పై ఈ శిబిరాల్లో ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వనున్నారు.
Also Read: గల్ఫ్ ‘ఆయిల్’ వార్.. సీజ్‌ఫైర్ తర్వాత సరికొత్త యుద్ధం.. భారత్ గట్టెక్కుతుందా?