E-Paper
Advertisement

గల్ఫ్ ‘ఆయిల్’ వార్.. సీజ్‌ఫైర్ తర్వాత సరికొత్త యుద్ధం.. భారత్ గట్టెక్కుతుందా?

గల్ఫ్ ‘ఆయిల్’ వార్.. సీజ్‌ఫైర్ తర్వాత సరికొత్త యుద్ధం.. భారత్ గట్టెక్కుతుందా?

Oil Crisis: గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న అలజడి జరిగినా దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద ఉంటుందనేది అనేకసార్లు చరిత్ర నిరూపించిన వాస్తవం. అలాంటిది ఏకంగా 40 రోజుల పాటు గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడులకు కౌంటర్‌గా గల్ఫ్ దేశాలపైనే ఇరాన్ దాడులు చేసింది. మొదట అమెరికన్ ఎయిర్‌బేస్‌లు, ఆ తర్వాత అమెరికా ఎంబసీలు, ఆ తర్వాత అమెరికన్ కంపెనీలు.. ఆ తర్వాత గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలను టార్గెట్ చేసింది ఇరాన్. ఇదే ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారబోతుంది.

రెండు వారాల సీజ్‌ఫైర్‌పై ఒప్పందం

రీసెంట్‌గా అమెరికా, ఇరాన్ సీజ్‌ ఫైర్‌కు అంగీకరించాయి. రెండు వారాల పాటు కాల్పులకు విరమణ ఇచ్చాయి. రెండు దేశాలు చేసిన ఈ స్టేట్‌మెంట్స్‌తో ప్రపంచ దేశాలు సంతోషించాయి. ఎందుకంటే హర్మూజ్‌ నుంచి ఏ చమురు, గ్యాస్‌తో పాటు ఏ కంటైనర్‌ షిప్‌ దాటే చాన్సే లేదంటూ ఇరాన్ ఇచ్చిన వార్నింగ్‌తో ప్రపంచ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు రూట్ క్లియర్ కావడంతో పరిస్థితులన్ని మునుపటిలా నార్మల్‌కు వచ్చేస్తాయనుకున్నారు. కానీ అదంతా సులువు కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

సౌదీ చమురు ఉత్పత్తికి భారీ దెబ్బ

సౌదీ ఇప్పుడు ఓ సంచలన ప్రకటన రిలీజ్ చేసింది. తాము చమురు ఉత్పత్తితో కోత విధిస్తున్నామని తెలిపింది. తమ చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు, ఆఖరికి చమురును సరఫరా చేసే పైప్‌లైన్స్ దెబ్బతిన్నాయని తెలిపింది. చమురు ఉత్పత్తి, రవాణా, రిఫైనరీ కేంద్రాలు, పెట్రోకెమికల్, పవర్ ప్లాంట్‌లు దెబ్బతిన్నాయనేది సౌదీ చెబుతున్న మాట. రియాద్‌తో పాటు రెడ్‌ సీ తీరంలోని యాన్బు నగరంలో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌లోని పంపింగ్ స్టేషన్ ధ్వంసమైందని, దాంతో రోజుకు ఏడు లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పడిపోయిందని అనౌన్స్ చేసింది. ఈ యుద్ధం కారణంగా మనిఫా, ఖురైస్‌లో రోజుకు ఆరు లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గిందని చెబుతోంది. అలాగే రాస్‌ తనురా, సమ్రెఫ్, సతోర్ప్‌ వంటి రిఫైనరీల పైనా దాడులు ఇరాన్‌ దాని అనుకూల వర్గాలు దాడులు చేశాయని చెబుతోంది. నిజానికి ఫలానా గ్రూప్ దాడులకు కారణమని సౌదీ చెప్పలేదు. కానీ ఇన్‌డైరెక్ట్‌గా ఇరానే కారణమంటోంది సౌదీ.

సీజ్‌ఫైర్ తర్వాత కూడా దాడుల ఆరోపణలు

కువైట్ కూడా తమపై ఇరాన్ దాడులు చేస్తుందని చెబుతోంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సీజ్‌ ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాత తాము ఏ గల్ఫ్ దేశంపై దాడులు చేయలేదని చెబుతోంది ఇరాన్. మరి దాడులు ఎవరు చేస్తున్నారు? గల్ఫ్ దేశాలు.. ముఖ్యంగా సౌదీ ఎందుకు ఉత్పత్తిని తగ్గించింది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే దీని వెనక గల్ఫ్ దేశాల కొత్త స్ట్రాటజీ ఉందా? అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇలా ఉత్పత్తిని తగ్గించడం వెనక ఆర్థిక, వ్యూహాత్మక, జీయో పాలిటిక్స్‌ కూడా ఒక కారణం అనే అనుమానం ఉంది. చమురు ధరల్లో స్థిరత్వం తీసుకురావడానికి ఇలా ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం కారణంగా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని వల్ల చమురుకు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు సరఫరా అలాగే ఉంటే ధరలు పడిపోతాయి. కాబట్టి ధరలు పడిపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఉత్పత్తిని తగ్గిస్తున్నారా? అనే అనుమానం కూడా ఉంది.

చమురు ధరలపై గల్ఫ్ దేశాల వ్యూహం

గల్ఫ్ దేశాల బడ్జెట్ సాఫీగా సాగాలంటే, చమురు ధర ఒక నిర్దిష్ట స్థాయిని మించి తగ్గకూడదు. యుద్ధానికి ముందు 80 -90 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్ చమురు ధర.. 120 డాలర్లకు వరకు వెళ్లింది. ఆ తర్వాత సడెన్‌గా యుద్ధం నిలిచిపోడంతో ఒక్కసారిగా చమురు ధర పడిపోయింది. ఇలానే కొనసాగితే గల్ఫ్ దేశాలు నష్టం. ఉత్పత్తిని తగ్గించడం ద్వారా మార్కెట్‌లో చమురుకు కొరతను సృష్టించి.. ధరలను పెంచుతున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

కొత్త ఆర్థిక వ్యూహాలు అమలులోకి

గత 40 రోజులుగా చమురు రవాణా దాదాపుగా నిలిచింది. దీంతో నిల్వ చేసిన బ్యారెళ్లు చాలా ఉన్నాయి. దీంతో కొత్తగా ఉత్పత్తి చేసినా వాటిని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడం కూడా ఉత్పత్తి తగ్గింపు కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇంకా యుద్ధ భయం పూర్తిగా వీడలేదు. అటు రెడ్‌ సీ మీదుగా పూర్తిగా ఎగుమతులు చేసే అవకాశం లేదు. హర్మూజ్ వద్ద ఇంకా పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో గల్ఫ్‌ దేశాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నాయనే చర్చ కూడా ఉంది. అమెరికా వంటి దేశాలు చమురు ధరలను తగ్గించాలని కోరుతున్నప్పటికీ, గల్ఫ్ దేశాలు తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీ అరేబియా, UAE, కువైట్, ఇరాక్ ప్రస్తుతం జరుగుతున్న చమురు ఉత్పత్తిని తగ్గించాయి.

చమురు మార్కెట్‌లో కొత్త అలజడి

ఎప్పుడైతే గల్ఫ్ దేశాలు ఉత్పత్తి తగ్గిస్తున్నామనే ప్రకటన చేశాయో.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మరోసారి టెన్షన్ మొదలైంది. మొన్నటి వరకు హర్మూజ్ కారణంగా చమురు రవాణా నిల్చిపోతేనే అనేక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడేమో ఉత్పత్తి తగ్గింపు అనే ప్రకటన మళ్లీ ఆందోళనలు పెంచుతున్నాయి. ఒక్కసారి ఈ అలజడి ప్రారంభమైతే అది ధరల పెరుగుదలకు కారణమవుతుంది. అది మళ్లీ చమురు మంటలను రేపడం కామన్‌గా మారుతుంది.

గల్ఫ్ ఇంధన హబ్‌లపై దాడులు

ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అనే సామెత ఇప్పుడు గల్ఫ్ దేశాలకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి.. ఇరాన్‌పై చేసిన దాడుల పుణ్యమా అని ఎక్కువగా నష్టపోయింది గల్ఫ్ దేశాలే. నిజం చెప్పాలంటూ ఊహించని నష్టాన్ని చవి చూశాయనే చెప్పాలి. ఎందుకంటే గల్ఫ్‌ దేశాలు యుద్ధ భూమి మాత్రమే కాదు.. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు గుండెలాంటిది. అలాంటి ప్రాంతం ఇప్పుడు ధ్వంసమైంది. గల్ఫ్‌ దేశాల్లోని చమురు రంగానికి చెందిన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వల్ల సౌదీ అరేబియాలోని రాస్ తనూరా, యూఏఈలోని రువైస్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీలు దెబ్బతిన్నాయి. ఖతార్‌లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్‌పై దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనివల్ల సుమారు 25 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని అంచనా.

గల్ఫ్ దేశాల జిడిపీపై భారీ దెబ్బ

అంతేకాదు.. చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో కువైట్, ఖతార్ వంటి దేశాల జిడిపి 14 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. అంతేనా.. ప్రతిరోజూ గల్ఫ్ దేశాలు తమ పర్యాటక రంగం ద్వారా సుమారు 600 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా దుబాయ్ వంటి పర్యాటక కేంద్రాలు నిర్మానుష్యంగా మారాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూతపడటంతో వేల సంఖ్యలో చమురు ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. షిప్పింగ్ ఇన్సూరెన్స్‌ ఖర్చులు ఆకాశాన్ని తాకాయి.

ఖతార్ గ్యాస్ ప్లాంట్లకు భారీ దెబ్బ

యుద్ధం ఇప్పుడే ఆగిపోయినా.. సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టేట్టూ కనిపిస్తోంది. చమురు సరఫరా, మార్కెట్ ధరలు ఒక క్రమ పద్ధతికి రావడానికి కనీసం 5 నెలలు పడుతుందనేది నిపుణుల అంచనా. ఇక దెబ్బతిన్న రిఫైనరీలు, ఎగుమతి టెర్మినల్స్ పూర్తి స్థాయిలో పనిచేయడానికి కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా. ఇక ఖతార్ వంటి దేశాల్లో భారీ గ్యాస్ టర్బైన్లు దెబ్బతిన్నాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే కంపెనీల దగ్గర ఇప్పటికే భారీగా బ్యాక్‌లాగ్ ఉండటం వల్ల, కొత్త పరికరాలు వచ్చి ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి 5 ఏళ్లు పట్టవచ్చని తెలుస్తోంది.

సరఫరా తగ్గింపుతో డిమాండ్ పెంచే వ్యూహమా?

ఆర్ధికంగా చూస్తే గల్ఫ్‌ దేశాలు ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నాయి. కానీ ఈ నిధులు ఉన్నా దెబ్బతిన్న సాంకేతిక మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడం అనేది సమయం, సహనంతో కూడుకున్న పని. ఇది కేవలం గల్ఫ్ దేశాలనే కాకుండా భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలను కూడా మరికొన్నాళ్లపాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈలోపు ఉత్పత్తిని తగ్గించి.. చమురును డిమాండ్‌ను పెంచే ఉద్దేశంలో గల్ఫ్ దేశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

చమురు కోత ప్రభావం భారత్‌పై ఎంత

మరి ఈ చమురు ఉత్పత్తి తగ్గింపుతో మనపై కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. నిజానికి యుద్ధం ప్రారంభమై హర్మూజ్ మూతపడగానే భారత్‌ ప్రత్యామ్నాయాలవైపు చూసింది. అనేక దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంది భారత్. అందుకే గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి తగ్గినా.. ఒకప్పటిలా అయితే భయానక పరిస్థితులు అయితే కనిపించడం లేదు. యుద్ధం సమయంలోనే గట్టెక్కాం.. ఇప్పుడు కూడా గట్టెక్కుతామనే నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వంలో. దీనికి తోడు అమెరికా ఆంక్షలు, ఆదేశాలకు లొంగకుండా.. నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు భారత్‌కు కామన్‌గా మారింది. సో.. మరీ అంతగా భయపడాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు.

యుద్ధం మళ్లీ మొదలైతే భారత్‌పై చమురు షాక్

నిజానికి ఇప్పుడు భారత్‌ను భయపెట్టేది ఏమైనా ఉంటే.. యుద్ధం మళ్లీ మొదలైతే ఎలా? అనే ప్రశ్న మాత్రమే. ఎందుకంటే సీజ్‌ ఫైర్‌ కొనసాగకపోయినా.. మళ్లీ దాడులు ప్రారంభమైనా దాని ఇంపాక్ట్ భారత్‌పై ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించారు. ప్రజలపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతూనే ఉంది. ధరలు నార్మల్ పరిస్థితికి వస్తే.. మళ్లీ ఎక్సైజ్ డ్యూటీలు పెంచే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఖాజానాకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ గల్ఫ్ దేశాల నిర్ణయం, మళ్లీ దాడులు జరిగితే కథ మళ్లీ మొదటికి వస్తుంది. అలా కాకుండా మళ్లీ చమురు ధరలు పెరిగితే ఈ సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదు. ఈ పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల సామాన్యుడిపై ఆర్థిక భారం మోపక తప్పని పరిస్థితి అని చెప్పాలి.

Also Read: సోషల్ మీడియాపై ఏపీ కొత్త చట్టం.. ఇక వాళ్లకి నో ఎంట్రీ

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×