BigTV English

Progress Report: జిల్లాలపై సర్కార్ ఫోకస్.. ఎన్నికోట్లు ఆమోదం అంటే..

Progress Report: జిల్లాలపై సర్కార్ ఫోకస్.. ఎన్నికోట్లు ఆమోదం అంటే..

Progress Report: ఈవారం ప్రజా ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు జరిగాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సీఎం ఢిల్లీ పర్యటనలతో బిజీబిజీగా గడిచింది. మధ్యాహ్న భోజనానికి ఎల్పీజీ కనెక్షన్లు, త్రీడీ డిజిటల్ ట్విన్ సిటీ మ్యాప్ కు అడుగులు, జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు, త్వరలో SLBC టన్నెల్ పనులు, జెట్ స్పీడ్ లో మామునూరు, కులగణనపై ఢిల్లీలో ప్రెజంటేషన్ ఇలాంటి పూర్తి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.


20-07-2025 ఆదివారం ( కళాకారులకు అండగా )
ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఓల్డ్ సిటీకి చెందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డును అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడన్నారు సీఎం రేవంత్. ప్రపంచ వేదికపై తెలుగు పాటకు ఖ్యాతిని తీసుకొచ్చిన రాహుల్ సిప్లిగంజ్ కి కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని సీఎం రేవంత్ గతంలో ప్రకటించారు. ఆ మేరకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు నజరానా ప్రకటించారు.

21-07-2025 సోమవారం ( నాన్ స్టాప్ గా రేషన్ కార్డులు )
భారీ వర్షాలు, వ్యవసాయం, ఆరోగ్యం, నీటి పారుదల వ్యవహారాలు, రేషన్ కార్డుల జారీ ఈ అయిదు అంశాలపై అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత సీజన్‌లో ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని, ఎరువులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అటు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు. పాత కార్డుల్లో పేర్లు తొలగించడం, కొత్త వారిని చేర్చడం వంటివన్నీ జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 96.95 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వాటి ద్వారా 3.10 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. సన్నబియ్యం మొదలు పెట్టాక రేషన్ కార్డులకు మరింత డిమాండ్ పెరిగింది.


21-07-2025 సోమవారం ( ATCలు రెడీ అవుతున్నాయ్ )
తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు తగ్గట్లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ రూపుదిద్దుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈనెల 21న ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై సచివాలయంలో సీఎం రేవంత్, మంత్రి వివేక్ వెంకటస్వామి ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏటీసీలు తెలంగాణ యువతకు అత్యాధునిక శిక్షణా సంస్థలు అన్న పేరుతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. మారుతున్న పరిస్థితులు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 దశల్లో 111 ATC ల అభివృద్ధి చేపట్టారు. అందులో మొదటి దశలో 25, రెండో దశలో 40, మూడో దశలో 46 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నారు. మొదటి రెండు దశలకు సంబంధించి ఇప్పటికే 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయి. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫార్మా, బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా ట్రైనింగ్ ఇచ్చే కోర్సులను అక్కడ నిర్వహించాలని చెప్పారు.

21-07-2025 సోమవారం ( గిగ్ వర్కర్లకు కొత్త పాలసీ )
తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రతిపాదిత పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 21న ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించేలా పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదిత పాలసీపై సీఎం రేవంత్, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సమీక్షించారు. పాలసీ గురించి అధికారులు వివరించినప్పుడు సీఎం పలు సూచనలు చేశారు. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆ బోర్డుకు ప్రభుత్వ ప్రాతినిథ్యం వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన పూర్తి డేటా ఆన్ లైన్ లో ఉండేలా చూడాలన్నారు.

22-07-2025 మంగళవారం ( హ్యామ్ రోడ్లకు తొలి అడుగు )
తెలంగాణలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ – హ్యామ్‌ విధానంలో ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో కొత్త రోడ్లను నిర్మించాలని, ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఆ దిశగా తొలి అడుగు పడింది. R&B శాఖలోని 16 సర్కిళ్లలో 5,190 కిలోమీటర్ల మేర ఉన్న 373 రోడ్ల పనుల కోసం 6,478.33 కోట్లు తక్షణ అవసరం అన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో 350 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించనున్నట్లు, మరో 4,840 కిలోమీటర్ల రోడ్లను డెవలప్ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో ఉమ్మడి నల్గొండ పరిధిలో 537 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. వీటి కోసం 623 కోట్లు కేటాయించారు. ఈ రోడ్లపై టోల్‌గేట్లు పెట్టకూడదని ప్రభుత్వం డిసైడైంది. హ్యామ్‌ పద్ధతిలో రూరల్ రోడ్లు వేయడం, విస్తరించడం రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైమ్.

23-07-2025 బుధవారం ( బీసీ కోటా చట్టబద్ధత కోసం )
తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజ‌ర్వేష‌న్లతో స్థానిక ఎన్నిక‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర హైకోర్టు 90 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నిక‌లు నిర్వహించాల‌ని, 30 రోజుల్లో రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయాల‌ని ఆదేశించిందని అయితే కేంద్రం ఆలస్యం చేస్తోందన్నారు సీఎం. పకడ్బందీగా సర్వే నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. సర్వేపై స్వతంత్ర నిపుణుల స‌ల‌హా క‌మిటీని నియమించి ఆ కమిటీకి ఇచ్చామని గుర్తు చేశారు. కుల గ‌ణ‌న విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి దిక్సూచిలా నిలిచిందన్నారు.

24-07-2025 గురువారం ( కులగణనపై ప్రెజంటేషన్ )
సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వేపై తెలంగాణ ప్రభుత్వం ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలకు కులగణన సర్వే గురించి వివరించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి కులగణన విజయవంతంగా చేపట్టారని, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు అంచనాలకు మించి రాణించారని రాహుల్ గాంధీ ప్రశంసించారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైల్ స్టోన్ అన్నారు. ఆఫీస్ రూముల్లో కూర్చుని కులగణన చేస్తే మంచి ఫలితాలు రావని, తెలంగాణ కులగణనలో దాదాపు 56 ప్రశ్నలు అడిగారని అన్నారు. దేశంలో కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందన్నారాయన.

25-07-2025 శుక్రవారం ( త్వరలో SLBC టన్నెల్ పనులు )
SLBC టన్నెల్ పనులపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పైకప్పు కూలి.. ఆగిపోయిన తర్వాత ఎలా ముందుకు వెళ్లొచ్చోనన్న విషయాలపై చర్చలు, సమాలోచనలు జరుగుతున్నాయి. కొన్ని మృతదేహాల ఆనవాళ్లు దొరకలేదు. అయితే తాజాగా మళ్లీ తవ్వకాలపై కదలిక పెరుగుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లిలోని ఎస్‌ఎల్‌బీసీ ఔట్‌లెట్‌ సొరంగాన్ని ఆర్మీ లెఫ్టినెంట్‌ కర్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా శుక్రవారం పరిశీలించారు. తవ్వకాల విషయంలో నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది త్వరలోనే తేలనుంది.

25-07-2025 శుక్రవారం ( జిల్లాలపై స్పెషల్ ఫోకస్ )
తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల అభివృద్ధి పనులు ఫాస్ట్ గా కచ్చితత్వంతో జరిపే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్‌ కు ఇలంబర్తి, రంగారెడ్డి – డి. దివ్య, ఆదిలాబాద్‌ – సి. హరికిరణ్‌, నల్గొండ – అనితా రామచంద్రన్‌, నిజామాబాద్‌ – ఆర్‌. హనుమంతు, మహబూబ్‌నగర్‌ – రవి, కరీంనగర్‌ – సర్ఫరాజ్‌ అహ్మద్‌, వరంగల్‌ – కె. శశాంక, మెదక్‌ – ఎ. శరత్‌, ఖమ్మం – కె. సురేంద్ర మోహన్‌ ను నియమించారు.

25-07-2025 శుక్రవారం ( జెట్ స్పీడ్ లో మామునూరు )
వరంగల్‌ జిల్లా మామునూరు ఎయిర్ పోర్ట్ పై రేవంత్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అన్ని అనుమతులు రావడంతో స్పీడ్ పెంచింది. భూసేకరణ కోసం ఈనెల 25న 205 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. విమానాశ్రయానికి 949.14 ఎకరాల భూమి అవసరం కాగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధీనంలో ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి ఉంది. మరో 253 ఎకరాల భూమి సేకరణ కోసం తాజాగా 205 కోట్లు రిలీజ్ చేశారు. టైటిల్‌ క్లియర్‌గా ఉన్న 15మంది రైతుల ఖాతాల్లో 13.74 కోట్ల పరిహారాన్ని జమ చేశారు. మిగితావారికీ ఇస్తున్నారు. వ్యవసాయ భూమికి ఎకరాకు 1.20కోట్లు, వ్యవసాయేతర భూమి గజానికి 4,887 పరిహారంగా నిర్ణయించారు. కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టు ఉండేలా ప్రణాళికలు తయారవుతున్నాయ్.

26-07-2025 శనివారం ( మధ్యాహ్న భోజనానికి ఎల్పీజీ కనెక్షన్లు )
మధ్యాహ్న భోజన పథకానికి సోలార్ కిచెన్ ల దిశగా అప్ గ్రేడ్ చేయాలని చొరవ తీసుకున్న రేవంత్ ప్రభుత్వం.. తాజాగా అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో కట్టెల పొయ్యిలను పక్కన పెట్టి ఎల్పీజీ సిలిండర్లపై వంట చేయాలని ఆదేశించింది. వంట కార్మికులకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇప్పించాలని కలెక్టర్లకు సూచించింది. పౌరసరఫరాలశాఖ అధికారులు, గ్యాస్‌ ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని కార్మికుల పేరిట కనెక్షన్లు ఇప్పించాలని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నది. తెలంగాణలోని 26,027 సర్కారీ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రతి విద్యా సంవత్సరం దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందుతున్నారు. కేంద్ర విద్యాశాఖ ఎన్నో ఏళ్లుగా గ్యాస్‌ పొయ్యిలపైనే వంట చేయాలని చెబుతున్నా.. తమకు గిట్టుబాటు కాదని వంట కార్మికులు ఆ దిశగా ముందడుగు వేయట్లేదు. 21శాతం బడుల్లోనే గ్యాస్ పై వంట చేస్తున్నారు.

26-07-2025 శనివారం ( వస్తోంది త్రీడీ డిజిటల్ ట్విన్ సిటీ)
హైదరాబాద్‌ 3డీ డిజిటల్‌ ట్విన్‌ సిటీకి ముందడుగు పడింది. ORR వరకు 2,053 చదరపు మీటర్ల ఏరియాలో ఈ త్రీడీ డిజిటల్‌ మ్యాప్ రెడీ చేయిస్తోంది హెచ్‌ఎండీఏ. త్రీడీ డిజిటల్ మ్యాప్ అంటే ఒరిజినల్ సిటీకి డిజిటల్ రెప్లికా అన్న మాట. దీన్ని 3డీలో తయారు చేయడంతో అన్ని ప్రాంతాలను రియల్‌టైంలో నేరుగా చూస్తున్న ఎక్స్ పీరియన్స్ వస్తుంది. విపత్తులు, ట్రాఫిక్‌ జాంల టైంలో అక్కడకు ఎలా చేరుకోవాలి.. ఎన్ని రోడ్లు ఉన్నాయి.. ఇలా సమాచారమంతా అప్పటికప్పుడు ఈ డిజిటల్‌ ట్విన్‌లో చూడవచ్చు. ఈ 3డీ డిజిటల్‌ ట్విన్‌ ద్వారా కొత్త రోడ్లు, భవనాలు, పార్కుల నిర్మాణాన్ని ముందుగానే గ్రాఫికల్‌గా అబ్జర్వ్ చేసి ఆక్రమణలు, ఉల్లంఘనలు లేకుండా చేయొచ్చు. వాటర్ సప్లై, కరెంట్, రవాణా, కమ్యూనికేషన్‌ వంటి డిపార్ట్ మెంట్స్ నిర్వహణను ఎఫెక్టివ్ గా చేయొచ్చంటున్నారు. ప్రస్తుతం కొన్ని సిటీలు డిజిటల్‌ ట్విన్‌లను తయారు చేసుకునే పనిలో ఉన్నాయి.

Story By Vidya sagar, Bigtv

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×