Ponnam Prabhakar: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై.. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీసీ రిజర్వేషన్లు మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం అని ఆయన స్పష్టంగా తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని, ఇది రాష్ట్ర పరిధిని దాటని విషయం కాబట్టి.. ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోగలదని మంత్రి గుర్తు చేశారు.
కోర్టు వ్యాఖ్యలపై సంతోషం
బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు మెరిట్ ఆధారంగా విచారణ చేపడతామని ప్రకటించడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఇది రిజర్వేషన్ల అమలు దిశగా సానుకూల సూచన అని ఆయన అన్నారు.
రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి
రిజర్వేషన్ల పెంపు విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ.. తమ అఫిడవిట్లు కోర్టుకు సమర్పించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇది బీసీ రిజర్వేషన్ల బలోపేతానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. అఫిడవిట్‌ల సేకరణ కోసం బీసీ మంత్రుల బృందం.. అన్ని రాజకీయ పక్షాలతో భేటీ అవుతుందని స్పష్టం చేశారు.
తమిళనాడు ఉదాహరణ
రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అటువంటి పరిస్థితి తెలంగాణలో ఎందుకు సాధ్యం కాని ప్రశ్నను ఆయన లేవనెత్తారు. తెలంగాణలో కూడా రిజర్వేషన్లను పెంచేందుకు తమ వంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నామని పేర్కొన్నారు.
పిటీషనర్లకు విజ్ఞప్తి
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కోర్టులో దాఖలైన పిటీషన్‌లను.. వెనక్కి తీసుకోవాలని పిటీషనర్లను పొన్నం ప్రభాకర్ అభ్యర్థించారు. ఇది సమాజంలో సమానత్వం నెలకొల్పే ప్రక్రియలో ముందడుగుగా ఉంటుందని ఆయన చెప్పారు.
సామాజిక మార్పును స్వాగతించాలి
బీసీ రిజర్వేషన్ల పెంపు ఒక సామాజిక మార్పు అని, దానిని అందరూ స్వాగతించాలని మంత్రి పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు కేవలం రాజకీయ వాగ్దానం కాదని, సమాజంలో వెనుకబడిన వర్గాల పురోగతికి అవసరమని ఆయన అన్నారు.
Also Read: రిలీజ్ కాకముందే ఆన్ లైన్‌లో ఎలా వస్తుందంటే? పైరసీ గ్యాంగ్‌పై CV ఆనంద్ షాకింగ్ నిజాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉదాహరణ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసిన మంత్రి, ఆ సమయంలో కూడా బీజేపీ ప్రారంభంలో వ్యతిరేకించినా, చివరికి మద్దతు ఇచ్చేలా ఒప్పించామని తెలిపారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో కూడా బీజేపీ సహకారం తీసుకొచ్చేలా కృషి చేస్తామని.. ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్‌పై ఏకాభిప్రాయం ఉంది: మంత్రి పొన్నం
అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయ నిర్ణయానికి కట్టుబడ్డాయి
న్యాయస్థానానికి అన్ని పార్టీలు రిజర్వేషన్‌పై తమ అభిప్రాయాలు వ్యక్తపరచాలి
50 శాతం అంశంపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
– మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/wcQagfH4GO
— BIG TV Breaking News (@bigtvtelugu) September 29, 2025