Big Stories

Republic Day: సర్కారుకు హైకోర్టు షాక్.. రిపబ్లిక్ డే జరపాల్సిందే.. పరేడ్ ఉండాల్సిందే..

Republic Day: నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుంది తెలంగాణ సర్కారు తీరు. దేశ గణతంత్ర దినోత్సవాన్నే ‘మమ’ అనిపించాలని చూసింది. గవర్నర్ మీద ఉన్న కోపంతో.. రాజ్యాంగ వేడుకలనే అబాసుపాలు చేయాలని భావించింది. కానీ, న్యాయవ్యవస్థ రూపంలో సర్కారుకు గట్టి షాక్ తగిలింది. పరేడ్ తో కూడిన రిపబ్లిక్ డే వేడుకలను తప్పకుండా జరపాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిపబ్లిక్ డే వేడుకలకు కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ పాటించాలని.. వేడుకలు ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించాలని.. వేడుకలకు ప్రజలను అనుమతించాలని తీర్పులో వెల్లడించింది. కొవిడ్ ను సాకుగా చూపి వేడుకలు ఆపడం సరికాదని సర్కారుకు మెట్టికాయలు వేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.

- Advertisement -

అసలేం జరిగిందంటే…
భారత గణతంత్ర దినోత్సవం. దేశానికే పెద్ద పండుగ. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన శుభదినం. ఊరూవాడా ఆసేతు హిమాచలం మువ్వన్నెల జెండా పండుగ అంతా ఘనంగా జరుపుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం రిపబ్లిక్ డే వేడుకలు రచ్చ రాజేస్తున్నాయి. మీకు మీరే మాకు మేమే.. ఎవరికి వాళ్లే అంటూ కేసీఆర్ సర్కారు వేరుగా ఉత్సవం జరుపుతామంటోంది. ఈ వేరు కుంపటి.. గవర్నర్ తమిళిసై స్థాయి తగ్గించడమేనంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటిదేమీ లేదంటూ సర్కారు ఎంతగా కవర్ చేసుకుంటున్నా.. అంతా ఆమె టార్గెట్ గానే అనేది ఓపెన్ సీక్రెట్.

- Advertisement -

కొవిడ్ కారణంగా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. ఈ లేఖపై గవర్నర్‌ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌ జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు.

రిపబ్లిక్ డే జగడంపై గవర్నర్ కు మద్దతుగా బీజేపీ నేతలు స్వరం పెంచారు. గవర్నర్ ను కేసీఆర్ సర్కారు పదే పదే అవమానిస్తోందని.. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.

అయితే, రిపబ్లిక్ డే ఎలా జరపాలో ప్రభుత్వానికి తెలుసంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ తనకు తాను అవమానం జరిగిందని అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే రాజ్ భవన్ లో వేడుకలు జరుగుతాయని చెప్పారు. ప్రోటోకాల్ విషయంలోనూ ఎలాంటి ఉల్లంఘనలు జరగడం లేదని వివరించారు.

మరోవైపు, తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరిస్తోందని.. ప్రభుత్వం అధికారికంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించేలా పిటిషనర్లు కోర్టును కోరారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. పరేడ్ తో కూడిన రిపబ్లిక్ డే వేడుకలు జరపాల్సిందేనని ఆదేశించడంతో వాట్ నెక్ట్స్? అనే ఆసక్తి పెరిగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News