Formula E Race Case: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించిన కంపెనీలపై పలుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గ్రీన్ కో ఆఫీస్‌తో పాటు ఏస్ జెన్‌నెక్ట్స్ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. ఇటు హైదరాబాద్.. అటు విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో తనికీల కోసం 10 మంది అధికారుల బృందం అక్కడకు వెళ్లింది.
మంగళవారం ఉదయం 11 గంటలకు మాదాపూర్‌లోని గ్రీన్ కో సంస్థకు చెందిన ఆఫీసులో సోదాలు చేసింది ఏసీబీ. ఎన్నికల బాండ్ల పేరిట రూ. 41 కోట్ల బీఆర్ఎస్‌కు ఇచ్చిన నేపథ్యంలో దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలపై ఫోకస్ చేసింది. డీఎస్పీ స్థాయి అధికారి ఈ సోదాల్లో పాల్గొన్నారు.
ఫార్ములా ఈ కారు రేసు ప్రమోటర్‌గా వ్యవహరించిన గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థల ఒప్పందాలపై ఆరా తీస్తోంది. గతంలో జరిగిన లావాదేవీలను సైతం పరిశీలిస్తోంది. సోదాల తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తోంది. అప్పటి ఒప్పందాలపై నోటీసులు జారీ చేయనుంది. ఆపై విచారణకు పిలిచే అవకాశముంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐపీఎస్ అధికారి దాన కిషోర్ నుంచి కీలక పత్రాలు తీసుకుంది ఏసీబీ.
ఇంతకీ ఈ కంపెనీ డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం. పాతికేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా గ్రీన్ కో సంస్థ ఏర్పాటైంది. తక్కువ సమయంలో భారీ కంపెనీగా ఎదిగింది. ఈ కంపెనీ వాళ్లకు వ్యాపార వర్గాలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కంపెనీ డైరెక్టర్‌గా అనిల్ ఉన్న సమయంలో ఆయన బ్రదర్ సునీల్ ఎన్నికల్లో ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెల్సిందే.
ALSO READ: హైకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు, ఇక విచారణ తప్పదు
గ్రీన్ కో సంస్థ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో ఆ కంపెనీ దక్కించుకున్న ప్రాజెక్టులు కలిపితే దాదాపు లక్ష కోట్ల వరకు ఉంటాయన్నది ఓ అంచనా. గడిచిన పదేళ్లు తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్‌తో ఈ కంపెనీకి సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.