Satya Re Release Date :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా గట్టిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘పోకిరి’ సినిమాతో ప్రారంభమైన ఈ హవా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాలు లేకపోతే.. ఆ హీరోల కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను మళ్లీతెరపై ప్రదర్శిస్తూ సంతోష పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘సత్య’ కూడా అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
వర్మ , జెడి కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీ..
ఇందులో జె.డీ.చక్రవర్తి (JD. Chakravarty)హీరోగా నటించగా.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ కెరియర్ కు మైల్ స్టోన్ గా నిలిచిందని చెప్పవచ్చు. 1998 జూలై 3వ తేదీన విడుదలైన ఈ సినిమా ఐఎండీబీలో ఏకంగా 8.3 రేటింగ్ సొంతం చేసుకుని, సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రచన, దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఊర్మిలా మండోద్కర్ (Urmila Mandodkar) నటించింది. ఇందులో షెఫాలీ షా, అరుణ్ బాలి, మనోజ్ వాజ్పేయి తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారతీయ గ్యాంగ్ స్టార్ ట్రయాలజీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ముంబైకి వలస వచ్చిన సత్య అనే యువకుడు ముంబై అండర్ వరల్డ్ లో ఇరుక్కోవడాన్ని ఇక్కడ కథగా చూపించారు.
సత్య మూవీకి వచ్చిన అవార్డులు..
క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా 1998లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, స్విట్జర్ల్యాండ్ లోని ఫ్రీ బర్గ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అలాగే న్యూయార్క్ ఆసియన్ ఫిలిం ఫెస్టివల్ వంటి వాటిల్లో ఈ సినిమాను ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించారు. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన 100 భారతీయ చలనచిత్ర జాబితాలో కూడా ఈ సినిమా చేరిపోయింది. అంతేకాదు 2005లో ఇండియన్ టైమ్స్ మూవీస్ లో సత్య ను తప్పకుండా చూడాల్సిన 25 బాలీవుడ్ సినిమాల జాబితాలో చేర్చడం గమనార్హం. కేవలం రూ.2కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్యమైన హిట్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫిలింఫేర్ అవార్డుల్లో ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు, ఫర్ బెస్ట్ మూవీస్ తో సహా ఆరు పురస్కారాలు అందుకున్న ఈ సినిమా నాలుగు స్టార్ స్క్రీన్ అవార్డులు, బాలీవుడ్ మూవీ అవార్డు నుంచి ఉత్తమ దర్శకుడు పురస్కారం కూడా లభించింది.
రీ రిలీజ్ కి సిద్ధమైన సత్య..
ఇక ఇలా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా మళ్లీ ఇన్నేళ్లకు విడుదల కావడానికి సిద్ధం అవుతుంది. దాదాపు విడుదలైన 26 ఏళ్ల తర్వాత ఈ సినిమాని జనవరి 17వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు కూడా మళ్లీ ఈ సినిమాతో థ్రిల్ పొందడానికి తెగ వెయిట్ చేస్తున్నారని చెప్పవచ్చు.