HYDRAA: హైడ్రా కార్యకలాపాలను నగర ప్రజలు గమనించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ సూచించారు. హైడ్రా వల్ల జరిగే ప్రయోజనాలపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాను కబ్జా చేసి రూ.100 కోట్లు కొల్లగొట్టేవారి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దల్ పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కబ్జాలకు పాల్పడుతున్న వారికి హైడ్రా అంటే గిట్టడంలేదన్నారు. వారు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ప్రభుత్వ భూములు కొల్లగొట్టారన్నారు. వారి నుంచి వందలు, వేల ఎకరాల భూములను హైడ్రా వెనక్కి తీసుకుంటోందని స్పష్టం చేశారు. అయితే రాత్రికి రాత్రి ఏ కట్టడాన్ని హైడ్రా కూల్చదని రంగనాథ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన విషషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏడాది పాటు అధ్యయనం చేసి అన్ని రికార్డులు పరిశీలించాకే ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
హైడ్రా వల్ల పేదవాళ్లకు ఎక్కడా అన్యాయం జరగలేదని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. హైడ్రా ఏర్పడి రెండేళ్లవుతుందని 2450 ఎకరాల భూమిని కబ్జాల చెర నుంచి విముక్తి కల్గించినట్లు వివరించారు. ఇందులో పెద్దలకు చెందిన కబ్జాలే ఉన్నాయన్నారు. చెరువుల పునరుద్ధరణలో గుడెసెలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చేలా హైడ్రా ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని ఏవీ రంగనాథ్ తెలిపారు. నగరంలో చెరువులతో పాటు నాలాలను కబ్జా చేసి వరదలకు కారణమవుతున్నారని కమిషనర్ రంగనాధ్ వ్యాఖ్యానించారు. పాత లే ఔట్లను చెరిపేసి అందులోని పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కొల్లగొడుతున్నారన్నారు.
Also Read: బొగ్గు స్కామ్ దాచేందుకే.. కిషన్ రెడ్డిపై దుష్ప్రచారం.. సీఎంపై రామంచర్ రావు ఫైర్
సామాన్యుల ప్లాట్లను కలిపేసుకుని చుక్కలు చూపెడుతున్నారని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. అటువంటి వారిపైనే హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. అయితే వారే హైడ్రాపై సామాజిక మాధ్యమాల ద్వారా బురద చల్లుతున్నారని వెల్లడించారు. అందులో వాస్తవాలు ఎంత అనేది గ్రహించాలని ప్రజలను రంగనాథ్ కోరారు. కబ్జాదారుల కబంద హస్తాల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకున్న భూములలో ప్రభుత్వం ఇంటర్‌సిటీ బస్సు టర్మినల్ నిర్మిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించడమే గాక, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణానికి వినియోగించాలని ప్రయత్నిస్తోందన్నారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి నగరంలో వరదల నియంత్రణకు హైడ్రా పని చేస్తోందన్నారు.
Also Read: అయ్యబాబోయ్.. కూలర్‌లో దూరిన పాము.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!