Indian Roller Conservation: ఒకప్పుడు చెరువులు, పొలాలు, జలాశయాల పరిసరాల్లో గుంపులుగా కనిపించే పాలపిట్టలు.. ఇప్పుడు ఎప్పుడో, ఎక్కడో ఒకచోట అత్యంత అరుదుగా కనిపిస్తున్నాయి. పట్టణీకరణ, గడ్డి భూములు తగ్గిపోవడం, సహజ ఆవాసాలు నాశనం కావడంతో ఈ అందమైన పక్షుల సంఖ్య ఏటా తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన పాలపిట్ట భవిష్యత్తుపైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ నివేదిక ప్రకారం దేశంలోని అనేక పక్షి జాతులు అంతరించిపోయేందుకు రెడీ అయ్యాయి. వాటిలో పాలపిట్ట కూడా ఒకటి. గడ్డి భూములు, మేత ప్రాంతాలు వేగంగా తగ్గిపోవడం వల్ల పాలపిట్టలకు ఆహారం దొరకడం కష్టమవుతోంది. సాధారనంగా ఈ పక్షులు మిడతలు, కీటకాలు, చిన్న సరీసృపాలు, కప్పలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ జీవుల సంఖ్య కూడా తగ్గుతుండటంతో పాలపిట్టల మనుగడ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. పక్షుల పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. గడ్డి భూములు తగ్గిపోవడం, చెట్లతో పాటు సహజ పర్యావరణ వ్యవస్థలు మారిపోవడం పాలపిట్టల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
రైతులకు మేలు చేసే పక్షి
పాలపిట్టను రైతు నేస్తం అని పిలుస్తారు. పంటలను నాశనం చేసే మిడతలు, కీటకాలు, చిన్న కప్పలు, బల్లులు లాంటి జీవులను తిని రైతులకు సాయం చేస్తుంది. అందువల్ల వ్యవసాయానికి ఉపయోగపడే పక్షిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పాలపిట్టలు సాధారణంగా చెట్ల తొర్రల్లో గూళ్లు కట్టుకుంటాయి. ఒకేసారి మూడు నుంచి ఐదు గుడ్లు పెడతాయి. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య వీటి సంతానోత్పత్తి కాలం ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం.. వీటి జీవితకాలం 17 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.
దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను చూడటం శుభమనే నమ్మకంతో కొందరు అక్రమంగా వాటిని పట్టుకుని పంజరాల్లో బంధిస్తుంటారు. రెక్కలు కత్తిరించడం, ఎగరకుండా చేయడం లాంటి చర్యల వల్ల అనేక పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి సంరక్షణ సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి.
పాలపిట్టను బంధించడం లేదా హింసించడం చట్టరీత్యా నేరమని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి, కనీసం మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఎక్కడైనా పాలపిట్టలను పంజరాల్లో బంధించి ఉంచినట్లు కనిపిస్తే వెంటనే సంబంధిత అటవీ శాఖ, జంతు సంరక్షణ సంస్థలకు సమాచారం ఇవ్వాలని అధికారులు, పక్షి ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పాలపిట్ట ఉనికికి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పక్షి నిపుణులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాన ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. పాలపిట్టల వేటను అరికట్టడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అదే సమయంలో అటవీ శాఖ ద్వారా వీటి వేటగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఎలాగైనా పాలపిట్టల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకుంటుంది.
Read Also: కాంక్రీట్ జంగిల్ కాదు.. పక్షుల స్వర్గధామంగా మారుతున్న భాగ్యనగరం!