Jagdgiri Gutta: రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేయటానికి ప్రయత్నించిన గ్యాంగును జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కత్తులు, ఓ సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లమ్మబండ నివాసి బోయ కిషన్ (44) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈనెల 12న అర్ధరాత్రి సమయంలో తన ఆఫీస్ లో ఉండగా ముగ్గురు దుండగులు లోపలికి చొరబడి ఆయనపై కత్తులు, సుత్తితో దాడి చేశారు. దాడిలో కిషన్ కు గాయాలయ్యాయి.
ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయగా జగద్గిరిగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్ సిబ్బంది దాడి జరిగిన ప్రాంతంతోపాటు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. వాటిని విశ్లేషించటం ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కిషన్ కు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవీందర్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి కొన్ని లావాదేవీలు జరిపారు. అయితే, ఆ తరువాత వ్యక్తిగత విభేదాలు తలెత్తటంతో విడిపోయారు. దాంతో మహేశ్ పై రవీందర్ కక్షను పెంచుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ముజాహిద్ పాషా, అజ్మత్, మహ్మద్ మహబూబ్ ఖాన్, అబ్దుల్ ఫారూఖ్, గురజాడ మహేశ్, రాజోలె సాయికుమార్ లకు 10లక్షల రూపాయల సుపారీ ఇచ్చాడు. పక్కాగా ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులు అందరినీ అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: భద్రాద్రి కొత్తగూడెం వాసులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!