PHFI Hyderabad: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) నూతన క్యాంపస్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా క్యాంపస్ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించిన సీఎం, తెలంగాణ అభివృద్ధి, వైద్య రంగంలో సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణపై తన దార్శనికతను ఆవిష్కరించారు. జూన్ 2, 2028 నాటికి ఈ క్యాంపస్ నిర్మాణం పూర్తి కావాలని ఆకాంక్షించిన ఆయన, ఈ సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని భరోసా ఇచ్చారు.
వైద్య రంగం.. మూసీ ప్రక్షాళనపై దృష్టి
హైదరాబాద్ ప్రతిష్ఠను ఐఎస్‌బీ, నల్సార్ యూనివర్సిటీలు పెంచాయని.. ఇప్పుడు ఆ కోవలోనే వైద్య రంగంలోని లోటును పీహెచ్‌ఎఫ్‌ఐ పూడ్చుతుందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించామని, గోషామహల్‌లో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల అభివృద్ధికి రూ.12 వేల కోట్లు, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ల కోసం ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సేకరించిన హెల్త్ డేటా ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని వ్యాధులను విశ్లేషిస్తున్నామని, క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించామని చెప్పారు. ఫ్లోరైడ్, మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లాలో పుట్టబోయే పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, నల్గొండ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలంటే మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
పాలసీల కొనసాగింపు – 2047 విజన్
రాజకీయ విభేదాలు వేరు, అభివృద్ధి పాలసీలు వేరని సీఎం స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల నుంచి చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ హయాంలో తెచ్చిన మంచి పాలసీలను కొనసాగిస్తున్నామని, తెలంగాణలో ఎలాంటి ‘పాలసీ పెరాలసిస్’ లేదని తేల్చిచెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో 2034 నాటికి వన్ ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలో 10 వేల చదరపు కిలోమీటర్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానం
స్వాతంత్య్రం వచ్చిన నాటి 12 శాతం అక్షరాస్యత నుంచి నేడు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగామని, నెహ్రూ వేసిన విద్య, నీటిపారుదల పునాదులు, రాజీవ్ గాంధీ టెక్నాలజీ విప్లవమే ఇందుకు కారణమని కొనియాడారు. 1965లో ఐడీపీఎల్ ఏర్పాటు వల్లే నేడు హైదరాబాద్ బల్క్ డ్రగ్స్ రాజధానిగా మారిందని, ఎలీ లిల్లీ వంటి దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తుచేశారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని.. పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ, సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy will attend the Foundation Stone Laying Ceremony and unveil the Campus Master Plan of the PHFI Institute of Public Health Sciences at Taj Krishna, Hyderabad. https://t.co/o9p7n6BjFH
— Revanth Reddy (@revanth_anumula) November 14, 2026
Also Read: మెక్రాన్ రొమాన్స్.. రాజకీయాల్లో రచ్చ.. ఈ పలకరింపుల వెనుక కథేంటి?