రాష్ట్రంలోని యువతకు ఒక సరైన రాజకీయ వేదికను అందించాలనే లక్ష్యంతోనే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు దిశానిర్దేశం చేస్తూ, రాజకీయాల్లో ఐడియాలజీ ప్రాముఖ్యతను వివరించారు.
గతంలో కొత్త పంథాను నమ్మి ఎంతోమంది యువత నక్సల్స్ ఉద్యమాల్లో చేరారని.. కానీ సరైన ఐడియాలజీ లేకపోవడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధాంతం బలంగా లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే జనసేన ఐడియాలజీని ప్రతి ఒక్కరూ లోతుగా అర్థం చేసుకోవాలని సూచించారు. ‘నేను ఏ ఒక్క కులం కోసమో పార్టీ పెట్టలేదు. అందరూ కలిస్తేనే సమాజం ఏర్పడుతుంది. జనసేన భావజాలం ఇప్పుడు మరింత విస్తృతమవుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయిన కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకుని.. వెన్నుముకగా నిలబడ్డ కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు లభించిందని పవన్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన 3,400 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని వెల్లడించారు. ‘మనం పదవుల కోసం పాకులాడటం లేదు. పదవి అనేది ఒక బాధ్యతగా భావించాలి. ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. క్షేత్రస్థాయిలో పని చేయడమే ముఖ్యమని హితబోధ చేశారు.
మన దేశంలో ప్రతి వంద కిలోమీటర్లకు భాష, ఆచారాలు మారుతుంటాయని.. వాటిని గౌరవిస్తూనే ముందుకు సాగాలని పవన్ అన్నారు. మానవ దురాశ వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి మాత్రమే శాశ్వతం. మనం చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం భారత రాజ్యాంగానికి లోబడే ఉండాలి’ అని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపడుతోందని, అందులో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని కోరారు.
చివరగా.. జనసేన నాయకులు గర్వంతో కాకుండా వినమ్రతతో ప్రజలకు సేవ చేయాలని, రాజ్యాంగబద్ధంగా బాధ్యతలు నిర్వర్తించి పార్టీ ప్రతిష్టను పెంచాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ALSO READ: Top 20 News: కేసీఆర్ విమర్శలకు సీతక్క స్ట్రాండ్ కౌంటర్, 2029లో పోటీ చేయడం ఖాయం.. కవిత