Telangana Politics : కడుపులో నీళ్లు కదలకుండా.. సర్కారీ కొలువు చేసుకునే వారికి రాజకీయాలు అచ్చిరావంటారు కొందరు. అయితే.. అది తప్పని, ఆఫీసుకే కాదు.. అసెంబ్లీకీ వెళ్లి సత్తా చాటగలమని నిరూపించారు మరికొందరు. వారి ప్రేరణతోనే ఈ ఎన్నికల్లోనూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తమ కొలువులకు స్వస్తి చెప్పి.. ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. వీరిలో కొందరు టికెట్ ఆశించి భంగపడి.. వచ్చే సారైనా లక్ తగలకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ వారెవరు.. వారి ముచ్చట్లేంటో ఓ లుక్కేద్దాం.
బషీర్‌బాగ్‌లోని ఉస్మానియా పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న అసిస్టెంట్ ఫ్రొఫెసర్.. గుమ్మడి అనురాధ కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక్కడి నుంచి 5 సార్లు గెలిచిన తన తండ్రి గుమ్మడి నర్సయ్య రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇప్పటికే.. స్వతంత్ర అభ్యర్థినిగా బరిలోకి దిగనున్నారు. వందేళ్ల ఓయూ చరిత్రలోనే తొలి ఆదివాసి ప్రిన్సిపల్‌గా రికార్డుకెక్కిన అనురాధకు రెండు ప్రధాన పార్టీలు టికెట్ ఆఫర్ చేసినా.. ఆమె మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో నిలిచారు. దీనికోసం ఎన్నికలు పూర్తయ్యేవరకు ఉద్యోగానికి సెలవు పెట్టారు.
వనపర్తికి చెందిన హెడ్మాస్టర్.. నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ (58) ఇంకా 4.5 ఏళ్ల సర్వీసు ఉండగానే వీఆర్‌ఎస్ తీసుకొని వనపర్తి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప బలమైన అభ్యర్థిగా ఉండగా.. ఆయనను ఢీ కొట్టడానికి ప్రజల్లో తిరుగుతూ గెలుపొందేందుకు సర్వశక్తులు కూడగట్టుకుంటున్నారు.
బోధనా వృత్తిలో ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కూడా కాంగ్రెస్ తరపున టికెట్ సాధించి, కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ టికెట్ రాకపోవటంతో ఆమె కాంగ్రెస్‌లో చేరి ప్రచారం చేస్తుండగా, ఆమె భర్త, జగిత్యాల ఆర్‌టీవోగా ఉన్న అజ్మీరా శ్యామ్‌నాయక్ తన కొలువుకు రాజీనామా చేసి పార్టీ ప్రచారంలోకి దిగారు.
కొందరు టికెట్ ఆశతో ఉద్యోగం వదిలి వచ్చినా.. వారికి పోటీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు, వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగి మామిళ్ల రాజేందర్ వీఆర్‌ఎస్ తీసుకుని బీఆర్ఎస్‌లో చేరి ప్రచారం చేస్తున్నారు.
ఇక.. ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్‌కు దరఖాస్తు చేసిన టీచర్ లక్ష్మణ్‌నాయక్ వీఆర్‌ఎస్ కోసం డీఈఓకు దరఖాస్తు చేయగా.. దరఖాస్తు రూల్స్ ప్రకారం లేదని దానిని తిరస్కరించారు.
ఆచార్యులకు వెసులు బాటు…! ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందే. అయితే.. విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి హోదా కలిగి ఉండటంతో అక్కడి టీచింగ్ స్టాఫ్‌కు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. వర్సిటీల్లో బోధనా వృత్తిలో ఉన్న ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలనుకుంటే.. వర్సిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకొని సెలవు పెడితే సరిపోతుంది. అయితే.. వారు ఏదైనా రాజకీయ పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మాత్రం.. ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందే.