డిజిటల్ మ్యూజిక్ దిగ్గజం Spotify.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై తమ ప్లాట్ ఫారమ్ లోని పాటలను నేరుగా వాట్సాప్ స్టేటల్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా, ఇప్పుడు వాట్సాప్ వినియోగదారుల ముందుకు రాబోతోంది. తాజాగా Spotify ఒక బ్లాగ్ పోస్ట్ లో ఈ కొత్త ఫీచర్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. వినియోగదారులు తమకు నచ్చిన మ్యూజిక్, ప్లే లిస్టులు, పాడ్ కాస్ట్ లు, ఆల్బమ్ లు, ఆర్టిస్ట్ క్లిప్ లతో పాటు ఆడియోబుక్ లను వారి వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఉంటున్న వాట్సాప్ స్టేటస్ మాదిరిగానే 24 గంటల పాటు ఇవి కనిపించనున్నాయి. ఆ తర్వాత ఆటో మేటిక్ గా మాయం కానున్నాయి.
వాట్సాప్ లో స్ట్రీమింగ్ కంటెంట్ ను షేర్ చేయడానికి, వినియోగదారులు Spotify యాప్ లోని ట్రాక్, ప్లే లిస్ట్ పక్కన ఉన్న షేర్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ఈ స్టేటస్ టైటిల్, కవర్ ఆర్ట్ తో పాటు ఓపెన్ ఆన్ స్పాటిఫై అనే ఆప్షన్స్ ను చూపిస్తుంది. దీని ద్వారా వీక్షకులు తమ స్పాటిఫై యాప్ లో ట్రాక్ ను ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఆయా ట్రాక్ ను షేర్ చేసే ముందు దానికి సంబంధించిన చిన్న ఆడియో ప్రివ్యూను కూడా వినే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఉచిత, ప్రీమియం వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరికొద్ది వారాల్లోనే షేర్ మెనూలలో వినియోగదారులు ఈ ఆప్షన్ ను చూసే అవకాశం ఉన్నట్లు Spotify వెల్లడించింది.
అటు Spotify కంటెంట్ ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో పంచుకోవడానికి మరో ఏడు మార్గాలను కూడా ప్రకటించింది. Spotify యాప్ లోని స్నేహితులకు నేరుగా మ్యూజిక్, పాడ్ కాస్ట్ లు, ఆడియోబుక్ లను మెసేజ్ లుగా పంపేందుకు అనుమతిస్తోంది. అటు ఇన్ స్టాగ్రామ్ లో Spotify ట్రాక్ షేర్ ఫీచర్ ను కూడా కంపెనీ మరింత అప్ డేట్ చేసింది. వీక్షకులు ఇప్పుడు పాటను ప్రివ్యూ చేసేలా చిన్న ఆడియో స్నిప్పెట్ ను వినే అవకాశం కల్పిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఇప్పుడు Spotifyలో వింటున్న వాటిని నోట్స్ ద్వారా రియల్ టైమ్ లోనూ షేర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. మొత్తంగా తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ తో Spotify వినియోగదారులు తమకు నచ్చిన పాటలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవచ్చు. తమ మిత్రులు కూడా ఆ మ్యూజిక్ ను ఎంజాయ్ చేసే అవకాశం కల్పించవచ్చు.
Read Also: రిలీజ్ కు రెడీ అయిన వన్ ప్లస్ 15.. స్పెసిఫికేషన్లు చూస్తే షాకవ్వాల్సిందే!