Karthika Pournami: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి మహిళలు, ప్రజలు ఇంటి ముందు తులసి గద్దెల వద్ద దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని ఆలయాలలోదీపాలు వెలిగించి ఆలయంలో హారతులు అర్పిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర, ముక్తేశ్వర, వేములవాడ, శ్రీశైలం, పంచారామక్షేత్రాలు వంటి దేవాలయాల దగ్గర నదుల్లో భక్తులు పవిత్ర స్నానం చేసి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి, కష్ణమ్మకు పసుపుతో గౌరమ్మను తయారుచేసి వదులుతున్నారు. అరటిదొప్పలతో దీపాలను పెడుతున్నారు. అనంతరం ఆలయాల ప్రాంగణంలోకి చేరుకుని చెట్ల కింద పోసి దీపాలను వెలిగించి లక్ష దీపాలను కాలుస్తున్నారు.
తిరుపతి జిల్లాల్లో దీపాలు వెలగించి.. మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లాలోని శైవ ఆలయాలు కిటకిటలాడిపోతున్నాయి. తెల్లవారుజాముల నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వీరికి తోడు అయ్యప్ప భక్తులు కూడా రావడంతో మరింతగా ఆలయాలు కిటికీలాడిపోతున్నారు. తిరుపతి కాశీబుగ్గ సంఘటన నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాచలంలో భక్తుల సందడి.. పవిత్ర గోదావరి నది తీరానికి భారీగా భక్తులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని గోదావరి నది తీరానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి, నదికి కార్తీక దీపాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నదీ తీరంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ రామాలయం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ఆలయ ప్రాంగణంలో 365 వత్తుల దీపాలను వెలిగించారు. వెలిగించిన దీపాల వెలుగులతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మరోవైపు, ఖమ్మం, మధిర, సత్తుపల్లి, వైరా, పాలేరు వంటి పురాతన పుణ్యక్షేత్రాల వద్ద ఉన్న నదులు, పవిత్ర స్థానాల వద్ద కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంకి భారీగా తరలివచ్చిన భక్తులు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి, బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలంపూర్ లోని తుంగభద్ర నదిలో, బీచుపల్లిలోని కృష్ణా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి.. నదిలో కార్తీక దీపాలు వెలిగించి బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు, జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీకమాస దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు అన్నీ ఓం నమః శివాయ, హార హార మహాదేవ శంభో శంకర అనే శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
కోదాడలో కార్తీక పౌర్ణమి శోభ.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
సూర్యాపేట జిల్లా కోదాడలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఈరోజు పౌర్ణమి కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముఖ్యంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో దీపారాధన చేశారు. కార్తీక పౌర్ణమి వేడుకలతో కోదాడ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.