Kaloji Birth Anniversary: పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమాన్నే తన ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ. ఆయన 110వ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం (సెప్టెంబర్ 9) రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళోజీ జీవితంపై వేసిన నాటకంతో పాటు ఇతర కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన కాళోజీ సేవలను స్మరించుకున్నారు.
ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన ” బతుకంతా దేశానిది” నాటకం ప్రేక్షకులను అలరించింది. జి. శివ రామ్ రెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించిన నాటకం చూపరులను ఆద్యంతం కట్టిపడేసింది. కాళోజీ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను కథాంశంగా తీసుకుని నాటకాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు కురిశాయి. నటీనటుల హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, ఉత్కంఠ భరిత మ్యూజిక్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని పంచాయి. కాళోజీగా అద్భుతంగా నటించిన శివరామ్ రెడ్డి నటనకు ప్రశంసల వర్షం కురిసింది.
Also Read: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు చేయొచ్చా?.. హైకోర్టు కీలక తీర్పు
ఈ కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హాజరయ్యారు. నాటక బృందాన్ని అభినందించారు. యువతరం నాటకాల వైపు అడుగువేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ప్రముఖ ఆర్టిస్ట్ మైమ్ మధు, డైరెక్టర్ అజిత్ నాగ్, రంగస్థల దర్శకుడు మోహన్ సేనాపతి, మేచినేని శ్రీనివాసరావు, ఉస్తాద్ ఒగ్గు రవి, డా. ఖాజా పాషా, డ్రీమ్ కాస్ట్యూమ్ కిరణ్, మేకప్ మెన్ మల్లాది గోపాలకృష్ణ. TETA బృందాన్ని కొనియాడారు. ఇలాంటి వేదికపై తెలంగాణ భాషను గురించి చెప్పే నాటకం ప్రదర్శించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.