Kavitha Speech: స్వేచ్ఛ బ్యూరో: కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఆదివారం తెలంగాణ రక్షణ సేన నిర్వహించిన పాంచ జన్య సంకల్ప సభకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణానికి ర్యాలీగా బయలుదేరిన కవిత తన అభిమానులకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ సభాస్థలికి చేరుకున్నారు. అనంతరం కవిత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
కోస్గి గడ్డపై తాను రెండోసారి అడుగుపెట్టానని కవిత తెలిపారు. 2009లో బీఆర్‌ఎస్-టీడీపీ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడితో కలిసి కోస్గిలో ఎన్నికల ప్రచార సభకు హాజరైనట్లు గుర్తుచేశారు. అదే సమయంలో కోస్గి సభకు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు మూడో వ్యక్తిగా తాను కోస్గి గడ్డపైకి వచ్చానని చెప్పారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్ నేతృత్వంలో తెలంగాణలో బహుజన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ వంటి పార్టీలు ఉన్నప్పుడు కొత్తగా మరో పార్టీ ఎందుకు అనే ప్రశ్న ప్రజలకు రావచ్చని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని విమర్శించారు. తెలంగాణ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో కష్టపడి చదివించినా యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని అన్నారు.
Also read: ఆలేరులో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన కీలక నాయకులు!
యువత అవసరాలను తీర్చేందుకు తల్లులు మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పిడికిలెత్తి పోరాడిన ఆడబిడ్డగా రాష్ట్ర స్థితిగతులను మార్చాలనే సంకల్పంతో తంగేడు పువ్వు రంగు జెండాతో, బహుజన అజెండాతో ప్రజల ముందుకు వచ్చానని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని కోరారు. పాంచ జన్య సంకల్ప సభ లక్ష్యం ఒక్కటేనని కవిత అన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడి శంఖం పేరు పాంచజన్యమని, సమాజంలో అధర్మం విజృంభించినప్పుడు దానికి వ్యతిరేకంగా యుద్ధానికి తన శ్రేణులను సన్నద్ధం చేసేందుకు పాంచజన్యాన్ని ఊదారని వివరించారు. సామాజిక న్యాయం కోసం పాంచజన్యాన్ని పూరిస్తున్నామని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఏ వ్యవస్థలో చదువుతున్న విద్యార్థులైనా వారి చదువుల ఖర్చులను ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.3,600 కాస్మెటిక్ చార్జీలు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం వాటిని కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. యువత మొత్తం అఫ్గానిస్థాన్, ఇరాన్‌లో పని చేసుకోవాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. విద్యా విధానంలో మార్పు రావాలని, ప్రతి గ్రామంలో బడి, ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రెండో ప్రాధాన్యతగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తామని కవిత తెలిపారు. నేటి ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఓ మహిళ తన కుమార్తె ప్రసవించిన అనంతరం మనవరాలి ముఖం చూపించేందుకు రూ.1,000 లంచం అడిగారని తనతో చెప్పినట్లు కవిత పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులకు చరమగీతం పాడుతామని, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ అనే తేడా లేకుండా అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు ఉంటే అందులో లక్షల కోట్ల రూపాయలను విద్య, వైద్య రంగాలకు కేటాయిస్తామని తెలిపారు.
చదువుకున్న యువత ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నదే తన లక్ష్యమని కవిత అన్నారు. పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించుకోవాలనుకునే వారికి రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also read: విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 38 కిలోమీటర్ల మేర కృష్ణా నది ప్రవహిస్తోందని, దుందుభి, తుంగభద్ర వంటి నదులు ఉన్నప్పటికీ రెండు ప్రభుత్వాలు మారినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని కవిత విమర్శించారు. జూరాల ఆయకట్టు రైతులు తమ పొలాలకు నీళ్లు విడుదల చేయడం లేదని ఓపిక నశించి గేట్లు ఎత్తడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. స్వతహాగా తాను రైతుబిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి హయాంలో యూరియా లేదని, కరెంటు లేదని, రైతు భరోసా, రైతు బీమా లేదని విమర్శించారు. పండించిన పంటను కొనేవారు లేక, బోనస్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా పాలమూరు జిల్లా రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
పాంచజన్యంలో అత్యంత ముఖ్యమైన అంశం సామాజిక న్యాయమని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో షాద్‌నగర్‌లో ఒక దళిత కుటుంబాన్ని పోలీసులు తీవ్రంగా హింసించారని ఆరోపించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ సంబంధిత పోలీసులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చాకలి కులానికి చెందిన కుటుంబంపై అగ్రకులస్తులు దాడి చేయగా చిన్నారి ప్రాణాలు కోల్పోయినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇది అగ్రకుల అహంభావానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
నారాయణపేట జిల్లా చిత్తనూరు వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు, మేధావులు నిరసన చేపట్టగా ఓ లెక్చరర్‌పై దాడి జరిగిందని, నరసింహులు అనే రైతు ప్రాణాలు కోల్పోయారని కవిత పేర్కొన్నారు. ఇదేనా మనం కోరుకున్న సామాజిక న్యాయం, ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. గద్వాల జిల్లా పెద్దధన్వాడ ప్రాంతంలో ప్రజలతో కలిసి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని వెనక్కి తీసుకుందని తెలిపారు. సామాజిక అన్యాయం వైపు ప్రభుత్వం ప్రయాణిస్తే బలమైన సర్పం కూడా చలి చీమల చేత చిక్కి చచ్చినట్లుగా బహుజన వర్గాల ఆగ్రహానికి బలవక తప్పదని కవిత వ్యాఖ్యానించారు.
మహిళలను మహారాణులుగా కీర్తించే రాజకీయ పార్టీలు వారికి రాజకీయ అవకాశాలు కల్పించేందుకు మాత్రం ముందుకు రావడం లేదని కవిత విమర్శించారు. ఇప్పటికీ వంటింటి పాత్రలపైనా మగవాళ్ల పేర్లే కనిపిస్తున్నాయని అన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రానికే మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొంటూ, ఈ పరిస్థితిని మార్చి తెలంగాణలో మాతృస్వామ్య వ్యవస్థకు అంకురార్పణ చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో ఇప్పటికీ అక్షరాస్యత శాతం ఆఫ్ఘనిస్థాన్ కంటే తక్కువగా ఉందని కవిత పేర్కొన్నారు. జిల్లాపై ప్రేమ ఉంటే రాబోయే రెండేళ్లలో అక్కడ పాఠశాలల సంఖ్య, విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంచాలని ప్రభుత్వానికి సూచించారు.
Also read: వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!