Dhaba Sitting: స్వేచ్ఛ బ్యూరో: రాజీవ్ రహదారిని ఆనుకుని తూముకుంట నుంచి తుర్కపల్లి వరకు ఉన్న కొన్ని దాబాలపై స్థానికుల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా దాబాల నిర్వహణకు, మద్యం విక్రయాలు–సేవలకు నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్ని చోట్ల అర్ధరాత్రి దాటినా ‘సిట్టింగ్’ కొనసాగుతోందని, మరికొన్ని చోట్ల తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సేవిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.
పగటిపూట సాధారణంగా కనిపించే దాబాలు రాత్రి వేళల్లో సందడిగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మద్యం సేవించిన కొందరు అక్కడి నుంచి వాహనాలతో బయలుదేరుతున్నారని, దీంతో రాజీవ్ రహదారిపై ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆయా దాబాలకు మద్యం విక్రయాలు లేదా సేవలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయా? ఉంటే నిర్ణీత నిబంధనలు, సమయపాలన పాటిస్తున్నారా? అన్నదే ప్రశ్నగా మారింది. అనుమతులు లేకుండా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలితే సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ వ్యవహారంపై శామీర్‌పేట్ పోలీసులు, అలియాబాద్ ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.
దాబాల నుంచి మద్యం సేవించి వాహనాలతో బయలుదేరే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత రాజీవ్ రహదారిపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అర్ధరాత్రి దాటినా దాబాల్లో సిట్టింగ్ కొనసాగుతోందన్న ఆరోపణలపై అధికారులు స్పందిస్తారా? ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
Also read: వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!