Palamuru Project: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజనసేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాకల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కేటీఆర్ ఒకసారి మనసాక్షిగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నమని, ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎవరు ఎంత ఖర్చు చేశారు? ఎంత పని పూర్తి చేశారు? ఎన్ని పంపులు ఏర్పాటు చేశారు? ఎన్ని స్టేజీల పనులు పూర్తయ్యాయి? అనే అంశాలపై బహిరంగంగా లెక్కలు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు ఏ స్థాయిలో జరిగాయో కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కేటీఆర్‌పై ఉందన్నారు. కేవలం ఒక మోటారు ఆన్ చేసి నీటిని చూపించి మొత్తం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం అభివృద్ధి కాదని మంత్రి విమర్శించారు.
పాలమూరు ప్రజలు అమాయకులు కాదని, పాలమూరు యువతకు వాస్తవాలు తెలుసన్నారు. ఎన్నికల ముందు ఒక మోటారు ఆన్ చేసి నీళ్లు చూపించి ప్రాజెక్టు పూర్తయిందని చెబితే ప్రజలు నమ్మే రోజులు పోయాయని మంత్రి ఏద్దేవా చేశారు. ప్రాజెక్టును స్టేజీల వారీగా పూర్తి చేయడం, అవసరమైన పంపులు ఏర్పాటు చేయడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం, అనుమతులు సాధించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు.
Also read: బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. షూటింగ్‌పై క్లారిటీ!
జూరాల నీటిని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పాలమూరు జిల్లాకు అత్యంత కీలకమైన నీటి వనరని, సాగునీటితో పాటు తాగునీరు, పశుపక్ష్యాదుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని శాస్త్రీయంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.ఈరోజు రాజకీయ లబ్ధి కోసం నీటిని విడుదల చేసి రేపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురావద్దని మంత్రి సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడుతున్న కేటీఆర్, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు చేయడం సులభమని, కానీ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు తీసుకురావడం, నిధులు సమకూర్చడం, భూసేకరణ సమస్యలను పరిష్కరించడం, పనులు పూర్తి చేయడం అంత సులభం కాదన్నారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులకు సాగునీరు అందించడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై వాస్తవాలు, లెక్కలు, స్టేజీల వారీగా పనుల పురోగతిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.పాలమూరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని మంత్రి స్పష్టం చేశారు.
Also read: నోరు అదుపులో పెట్టుకోండి.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్!