Venkat Reddy: మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందని ఎద్దేవా చేసిన ఆయన, పాలమూరు ప్రాంతానికి మాజీ సీఎం కేసీఆర్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా హెచ్చరించారు.
అక్రమాలు, ఫామ్‌హౌస్ దందాలపై ధ్వజం
ప్రజల సొమ్మును దోచుకుని వందల ఎకరాలు ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోబోమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అసైన్డ్, లావాణీ పట్టా భూములు మరియు 111 జీవోను ఆసరాగా చేసుకుని గత పాలకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేటీఆర్ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన తీరు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. చివరికి ఫామ్‌హౌస్‌లలో డ్రగ్స్ దందాలకు తెరలేపారని, ఆ వ్యవహారంలో కేటీఆర్ బావమర్ది కూడా పట్టుబడ్డాడని, అందుకు సంబంధించిన అగ్రిమెంట్లు తమ దగ్గర ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేల రాజీనామాలపై ఘాటు స్పందన
ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులకు కోమటిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలను తమ పార్టీలో చేర్చుకుని నేరుగా మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఈ నియమాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సంతలో పశువులను కొన్నట్లు అప్పట్లో డబ్బులు ఇచ్చి దానం నాగిరెడ్డి లాంటి వారిని కొనుగోలు చేసిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. చట్టసభల నియమాలు తమకూ తెలుసని, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచే తాను ఇవన్నీ గమనిస్తున్నానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నేతలు పొర్లుదండాలు పెట్టినా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్