Kalvakuntla Kavitha: మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్ విఫలమయ్యారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని కవిత మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ బెదిరింపులకు భయపడేందుకు ఉద్యోగులు బానిసలు కాదన్న విషయం సీఎం గుర్తుపెట్టుకోవాలని కవిత అన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేదని, కాంగ్రెస్ సర్కార్ పని కూడా అయిపోయిందని తేల్చి చెప్పారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు సంతోషంగా, గౌరవంగా ఉండేలా చూస్తామని, వాళ్లను అభివృద్ధిలో డెవలపర్స్ గా చేస్తామన్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను అడిగే విషయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని కవిత సూచించారు. తల్లి కాంగ్రెస్ తోనే పోరాడి తెలంగాణ తెచ్చుకున్న మనకు ఈ పిల్ల కాంగ్రెస్ తో పోరాటం చేయడం ఓ లెక్క కాదన్నారు. ఉద్యోగులకు గత 32 నెలలుగా ఆరు డీఏలు బకాయిలు పెట్టారన్న ఆమె.. నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సిన కరవు భత్యాన్ని కాంగ్రెస్ మింగేసిందన్నారు.
ఏ ప్రభుత్వమైనా పారదర్శకమైన పాలన అందించాలంటే అందుకు ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని కవిత చెప్పారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పడం, మడమ తిప్పడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ట్రేడ్ మార్క్ అని కవిత విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క టీచర్, ప్రభుత్వ ఉద్యోగి కూడా సంతోషంగా లేరని కవిత ఆరోపంచారు. ముఖ్యంగా టీచర్ల విషయంలో ప్రభుత్వ వైఖరి అమానుషంగా ఉందన్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వటం లేదని, డీఏ బకాయిలు పెండింగ్ పెడుతున్నారన్నారు. పైగా ఎప్పుడు ఏదో రిపోర్ట్ పేరుతో వాళ్లు చదువు చెప్పకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 40 శాతం పోస్టులు ఖాళీలు ఉంటే వాటిని భర్తీ చేయకుండా ఉన్న టీచర్లను సరిగా చూసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2003 లో రిక్రూట్ అయిన టీచర్లకు ఓపీఎస్ అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
Also Read: iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!
కనీసం ఉద్యోగుల హెల్త్ కార్డు కూడా పనిచేయని పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉందని కవిత అన్నారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ లోనైనా హెల్త్ కార్డు చెల్లుబాటు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిన చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కవిత అన్నారు. ఒకవేళ హెల్త్ కార్డు పనిచేయకపోతే ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? అంటూ కవిత ఛాలెంజ్ విసిరారు. అటు రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి కూడా బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రావాల్సిన ప్రయోజనాలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ నెల 18 వ తేదీ లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే హైదరాబాద్ దిగ్భంధనానికి ఉద్యోగ సంఘాలు పిలుపునివ్వాలని కవిత కోరారు.
Also Read: అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు