KTR Slams: 22ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 30 శాతం కమిషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామని, అయితే రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని కేటీఆర్ అన్నారు. ‘తప్పు చేసింది అధికారులు కాదు.. ప్రభుత్వమే. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అధికారులపై నెపం నెట్టడం సరికాదు’ అని కేటీఆర్ అన్నారు. ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లయితే వాటిని బేషరతుగా తొలగించి బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. యజమాని వేలిముద్ర లేకుండా ఆస్తి బదిలీ చేయడం సాధ్యం కాని విధంగా భద్రత ఉండేదన్నారు. ప్రస్తుతం యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ‘ఇది భూభారతి కాదు.. భూ హారతి’ అని వ్యాఖ్యానించారు. అన్ని అడ్డగోలు చర్యలను నిలిపివేసి ప్రజల యాజమాన్య హక్కులకు రక్షణ కల్పించేలా యథాతథ పరిస్థితిని పునరుద్ధరించాలని కోరారు.
అటు అసైన్డ్ భూములపై ఇచ్చిన హామీ ప్రకారం ఒక నిర్ణయానికి రావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని పట్టుబట్టారు. అయితే అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే పేరుతో ముందుగానే ఒప్పందాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి పథకం వెనుక అక్రమాలు ఉన్నాయన్న తమ ఆరోపణలు భవిష్యత్తులో వెలుగులోకి వస్తాయని అన్నారు.
మరోవైపు 22ఏ వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిగితే అందరికీ మంచిదేనని కేటీఆర్ అన్నారు. ‘తప్పు చేసింది ప్రభుత్వం.. శిక్ష అనుభవిస్తున్నది ప్రజలు’ అని వ్యాఖ్యానించారు. నిషేధిత జాబితాలో ఆస్తులను చేర్చడం ద్వారా ప్రజల యాజమాన్య హక్కులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇవాళ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేరని హెచ్చరించారు.
Also Read: కాంగ్రెస్‌లో సీఎం సీటు రగడ.. తెలంగాణ మరో బంగ్లాదేశ్ కాబోతోంది.. బండి సంజయ్ హాట్ కామెంట్స్!
అటు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సిబ్బందిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ‘పోలీసులను నమ్ముకుంటే న్యాయం దొరకదనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం. న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాం’ అని కేటీఆర్ అన్నారు.
Also Read: వాట్సప్ నెంబర్ మార్చేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ పాత చాట్స్ అన్నీ గోవిందా!