Chanakya Niti Weakness Of Good People| మంచితనం మనిషికి గొప్ప గుణం. కానీ అదే మంచితనం హద్దులు దాటితే ఇతరులు దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. మీరు ఎంత మంచివారైనా, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆచార్య చాణక్యుడు మనిషి స్వభావం, సంబంధాలు, ప్రవర్తన గురించి ఎన్నో విషయాలను తన నీతుల్లో వివరించారు. ముఖ్యంగా మంచి మనసున్న వ్యక్తుల కొన్ని అలవాట్లు వారికే బలహీనతలుగా మారవచ్చని ఆయన సూచించారు.
చాణక్య నీతి ప్రకారం.. అవసరానికి మించి అమాయకంగా ఉండటం ఒక బలహీనతగా మారవచ్చు. మంచి మనసున్న వ్యక్తులు సాధారణంగా ఇతరుల గురించి చెడుగా ఆలోచించరు. అందరూ తమలాగే నిజాయితీగా ఉంటారని వారు భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరి ఆలోచనలు, ఉద్దేశాలు ఒకేలా ఉండవు. చాణక్యుడు ఈ విషయాన్ని చెట్ల ఉదాహరణతో వివరించాడు.
అడవిలో కట్టెల కోసం వెళ్లిన వ్యక్తి ముందుగా నిటారుగా ఉన్న చెట్లను ఎంచుకుంటాడు. వంకరగా ఉన్న చెట్లను నరికేందుకు ఎక్కువ శ్రమ అవసరం కావడంతో వాటిని వదిలేస్తాడు. అదేవిధంగా, చాలా సూటిగా ఉండే వ్యక్తులను కొందరు సులభంగా మోసం చేయవచ్చు. అందుకే మంచితనంతో పాటు పరిస్థితిని అర్థం చేసుకునే తెలివి కూడా అవసరం.
మంచి వ్యక్తులు ఇతరులపై త్వరగా నమ్మకం పెట్టుకునే అవకాశం ఉంటుంది. తాము నిజాయితీగా ఉంటే, ఎదుటివారు కూడా అలాగే ఉంటారని వారు అనుకోవడం పొరపాటు. ఈ నమ్మకం కొన్నిసార్లు మోసానికి అవకాశం కల్పిస్తుంది. చాణక్య నీతి ప్రకారం.. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఒక వ్యక్తి మాటలకంటే అతని ప్రవర్తనను గమనించడం ముఖ్యం. నమ్మకం కూడా ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఏర్పడాలి. వ్యక్తిగత విషయాలు, రహస్యాలు లేదా ముఖ్యమైన సమాచారాన్ని అందరితో పంచుకోకూడదు. జాగ్రత్తగా ఉండటం అంటే అందరినీ అనుమానించడం కాదు.
ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవడం మాత్రమే.
Also Read: కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయంలో తమ అభిప్రాయం చెబుతుంటారు
మంచి మనసున్న వ్యక్తులు ఇతరుల మనసు బాధపడకూడదని అనుకుంటారు. అందుకే ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే అంగీకరిస్తారు. తమకు సమయం లేకపోయినా ఇతరుల పనులకు ప్రాధాన్యం ఇస్తారు. కొన్నిసార్లు దీనివల్ల వారి పనులు, సమయం, ప్రశాంతత కూడా దెబ్బతింటాయి. ప్రతిసారీ ‘అవును’ అని చెప్పడం వల్ల ఇతరులు మీ సహాయాన్ని అలవాటుగా మార్చుకోవచ్చు. మీ మంచితనాన్ని కొందరు తమ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే అవసరమైనప్పుడు ‘గౌరవంగా’ కుదరదు లేదా ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. ఎవరినైనా తిరస్కరించడం వల్ల మీరు చెడు వ్యక్తి అని అర్థం కాదు.
నిజాయితీగా, సహాయకారిగా, మంచిగా ఉండటం గొప్ప లక్షణాలు. అయితే వాటితో పాటు ఆత్మగౌరవం, జాగ్రత్త కూడా అవసరం. మీ మంచితనాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నమ్మాలో, ఎప్పుడు తిరస్కరించాలో, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి. మంచితనం అంటే ప్రతి విషయాన్ని భరించడం కాదని గుర్తుంచుకోవాలి. సరైన హద్దులు పెట్టుకుంటే ఇతరుల నుంచి మీ సమయాన్ని, మనశ్శాంతిని కాపాడుకోవచ్చు.
Also Read: మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ