Minister Sacked:సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుండి కొండా సురేఖను తప్పించేశారు.ఇందులో భాగంగా ఆమెని తప్పించాలన్న సిఫారసును గవర్నర్‌కు పంపారు కూడా.కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
అయితే ఇలా కొండా సురేఖని పార్టీ నుండి బయటకు పంపడంతో తెలుగు రాష్ట్రరాజకీయాల్లో మరోసారి మంత్రుల బర్తరఫ్ అంశం తెరమీదకి వచ్చింది.దీంతో గతంలో ఎవరెవరు ఇలా మంత్రి వర్గాల నుండి బర్తరఫ్ అయ్యారా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు.మరి గతంలో ఎవరెవరు బర్తరఫ్ బాట పడ్డారో ఇప్పుడు చూద్దాం.
బర్తరఫ్ విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ క్యాబినేట్ గురించే.1988లో ఆంద్రప్రదేశ్ సీయం గా ఉన్న ఎన్టీఆర్ ఒకరినో ఇద్దరినో కాదు.ఏకంగా 31 మంది మంత్రులను ఒకేసారి బర్తరఫ్ చేసి ఆనాటి రాజకీయాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు,అవును ప్రభుత్వంలో అత్యంత రహస్యంగా ఉండాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు ప్రెస్‌కు లీక్ అయ్యాయన్న కారణంతో 31 మందిపై వేటు వేయడం గమనార్హం.
ఇక దాదాపు నెల సమయం తీసుకున్న ఎన్టీఆర్ కొత్తగా 23 మందితో సరికొత్త క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఈ బర్తరఫ్ కారణంగానే కె.ఈ. కృష్ణమూర్తి, కె. జానారెడ్డి, ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వరరావు వంటి పెద్ద పెద్ద నాయకులు టీడిపిని వీడి కాంగ్రెస్ వైపు వెళ్ళారని అప్పట్లో వినిపించింది.ఒకరకంగా తెలుగు దేశం 1989లో తిరిగి అధికారం చేజిక్కించుకోక పోవడానికి ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయమే ప్రధాన కారణం అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటుంది.
ఇక 1992లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఏకంగా సీయం సీటుకే ఎసరు పెట్టడం గమనార్హం. విషయంలోకి వెళ్తే 1992లో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం,అలాగే క్యాపిటేషన్ ఫీజు వసూలుకు సడలింపులు ఇవ్వడం వంటివి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.
అప్పటివరకు అమలులో ఉన్న 1983 చట్టం ప్రకారం క్యాపిటేషన్ ఫీజు నిషేధంలో ఉండగా, ప్రభుత్వం చట్టానికి ‘సెక్షన్ 3-A’ తెచ్చి ప్రైవేట్ కాలేజీలకు లాభం చేకూర్చే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే వచ్చిన 57 దరఖాస్తుల్లో 12 మెడికల్, 8 డెంటల్ కాలేజీలకు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజే సీఎం ఎన్. జనార్ధన్ రెడ్డి వేగంగా ఓకే చెప్పారు.
దీంతో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విద్యార్థి సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు.. క్యాపిటేషన్ ఫీజు విధానం రాజ్యాంగ విరుద్ధమని, విద్యను డబ్బున్నవారికే పరిమితం చేసేలా ఉందని తీర్పు ఇచ్చింది. అలాగే అత్యంత వేగంగా జీవోలు ఇవ్వడంపై, సీఎం నిర్ణయ విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కోర్టు తీర్పుతో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు వేడెక్కి, అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచడంతో అధిష్ఠానం ఆదేశాల మేరకు 1992 అక్టోబర్ 9న జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎం అయ్యారు. ఒక ప్రభుత్వ విద్యా విధానంపై కోర్టు వ్యాఖ్యల వల్ల ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఊడటం అప్పట్లో ఒక సంచలనం.
ఇక వై.ఎస్. రాజశేఖర రెడ్డి కేబినెట్లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) తో పొత్తులో భాగంగా మొదట ప్రభుత్వంలో చేరిన టిఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి వారు తర్వాత ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో తమ పదవులకు రాజీనామాలు సమర్పించడం మనకి తెలిసిందే.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్‌షీట్లలో పేర్లు నమోదైనందుకు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో ఉన్న నాటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులను మంత్రివర్గం నుండి తప్పించాలనే డిమాండ్ల నడుమ వారు తమ పదవులకు రాజీనామా చేశారు.
2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి చేనేత, జౌళి శాఖ మంత్రి పి. శంకర్ రావును కేబినెట్ నుంచి తొలగించడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సహచర మంత్రులు, ముఖ్యమంత్రిపై ఆయన వరుసగా బహిరంగ ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో ఈ చర్య తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజీనామా చేయాలని కోరినా ఆయన అంగీకరించకపోవడంతో గవర్నర్, ముఖ్యమంత్రి సిఫారసు మేరకు ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారని వినిపించింది.
ఇక 2013లో మరో ఇద్దరు సీనియర్ మంత్రుల విషయంలోనూ ఇలాంటి ఘటననే చోటు చేసుకుంది.వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన సీబీఐ చార్జ్‌షీట్లలో పేర్లు రావడంతో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న అప్పటి హోంమంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు-భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాలు సమర్పించారు.అయితే ఇవి నేరుగా బర్తరఫ్‌లు కాకపోయినా, రాజకీయ ఒత్తిళ్ల మధ్య మంత్రివర్గం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మంత్రివర్గం నుంచి తొలగింపులు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. 2015 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్యను కేసీఆర్ అకస్మాత్తుగా కేబినెట్ నుంచి తప్పించారు. ఆయన శాఖలో అవినీతి ఆరోపణలు, అలాగే స్వైన్‌ఫ్లూ నియంత్రణలో ఆరోగ్య శాఖ పనితీరుపై వచ్చిన విమర్శలు ఈ నిర్ణయానికి కారణం అని వినిపించింది.ఇక రాజయ్య స్థానంలో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజయ్య ఖండించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక తెలంగాణ వచ్చాక రాజకీయాల్లో జరిగిన మరో బర్తరఫ్ అంశం అప్పట్లో రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసింది. 2021 మేలో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో కేసీఆర్ మొదటగా ఆరోగ్యశాఖని తన పరిధిలోకి తీసుకున్నారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత ఈటలను మంత్రివర్గం నుంచి పూర్తిగా తొలగించారు. దీంతో ఈటల తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తనకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించిన సంగతి మనకి తెల్సిందే.
ALSO READ:రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!
అయితే ఎన్టీఆర్ కాలంలో ఒకేసారి 31 మంది మంత్రుల వ్యవహారం నుంచి మొదలుపెడితే, శంకర్ రావు, రాజయ్య, ఈటల రాజేందర్ వంటి నేతల వరకు వచ్చిన బర్తరఫ్‌ల వెనుక ఉన్న కారణాలు వేర్వేరు.మొత్తానికి ప్రభుత్వంలో ఉండగానే పదవిని కోల్పోవడం వారి వారి పొలిటికల్ లైఫ్ లో ఒక టర్నింగ్ గా నిలిచింది.మరి ఈ బర్తరఫ్ వ్యవహారం కొండా సురేఖ పొలిటికల్ జర్నీని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.