Konda Surekha Letter:తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం ఇపుడు అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా కొండా సురేఖని క్యాబినెట్ నుండి సాగనంపడంతో తాను అధిష్టానానికి పంపిన లేఖని మీడియాకి రిలీజ్ చేసి సంచలనం స్ప్రుష్టించారు.అయితే ఈ లేఖని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే,కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ వంటి పార్టీ ప్రధాన నాయకులకి ఆగష్టు 22, 23 తేదీల్లోనే ఆమె ఈ లేఖను పంపించానని చెప్పడం గమనార్హం.
లేఖ విషయానికి వస్తే తాను ఒక బీసీ మహిళా మంత్రిని అయినందుకే తనపై రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్రమైన అణచివేత జరుగుతోందని కొండా సురేఖ లేఖలో తన ఆవేదనని వ్యక్తం చేశారు.
సొంత ప్రభుత్వంలోనే తనను ఒక నామమాత్రపు మంత్రిగా మార్చేశారని, తన శాఖలకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాల్లో కూడా కనీసం సంప్రదించడం లేదని ఆమె తన బాధని వెళ్లగక్కారు. మంత్రిత్వ శాఖల నిర్ణయాలన్నీ సీఎం కార్యాలయం నుంచే నేరుగా వెళ్తుండటంతో తన హోదా పూర్తిగా దిగజారిపోయిందని ఆరోపించారు.
ఇక ముఖ్యంగా యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధికి సంబంధించిన నిధులను తన ప్రమేయం లేకుండానే ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేయడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు శ్రీరామ నవమి సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనల్లో తన ఫొటోను కావాలనే తొలగించారని వాపోయారు.
ఇక ఇది చాలదన్నట్లు, తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ను పదవి నుంచి తొలగించేటప్పుడు తనకు చెప్పకపోగా, ఏకంగా పోలీసులను తన నివాసానికే పంపి సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారంటూ ఆనాడు జరిగిన విషయాలని వివరించారు. అతనిపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం తనను వ్యక్తిగతంగా మానసిక క్షోభకు గురిచేసిందని చెప్పారు. వరంగల్ జిల్లాలో కూడా తనను, కొండా కుటుంబాన్ని రాజకీయంగా తీవ్రంగా ఒంటరి చేసేందుకు సొంత పార్టీ నేతలే కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన అనుమతి కూడా లేకుండా ఎండోమెంట్స్ అధికారులతో సమీక్ష నిర్వహించడంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
ఇక నియోజకవర్గ అభివృద్ధి విషయానికొస్తే, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి రావలసిన స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్, బొంది వాగు విస్తరణ నిధులను కావాలనే ఆలస్యం చేస్తున్నారని, పక్క నియోజకవర్గాలకు మాత్రం నిధులు వరదలా పారుతున్నాయని ఆరోపించారు.
వీటన్నింటికీ తోడు, తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు ఒక తల్లిగా ఉన్న తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ఒక వయోజనురాలు చేసిన కామెంట్లకు తల్లిని బాధ్యురాలిని చేయడం ఎక్కడి న్యాయమని, ఇతర నేతల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్న పార్టీ, తన విషయంలో మాత్రం సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని రోజులుగా తన కుటుంబంపై పక్కా ప్రణాళికతో రాజకీయ దాడి జరుగుతోందని, బీసీ నేతలను ఎదగనీయకుండా తొక్కిపట్టే యత్నం సాగుతోందని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. సుదీర్ఘమైన 31 ఏళ్ల పార్టీ అనుబంధాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నానని, తెలంగాణ పార్టీ నాయకత్వంతో మాట్లాడి అసలు వాస్తవాలు తెలుసుకోవాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.
తన అధికారాల కుదింపు, తనపై జరుగుతున్న రాజకీయ దాడులు, ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వివక్షపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ ఆరోపణలన్నింటికీ సంబంధించిన దృశ్యాలు, ఆధారాలు, వీడియో క్లిప్పింగ్స్‌తో కూడిన ఒక పెన్‌డ్రైవ్‌ను కూడా లేఖతో జతచేసి అధిష్టానానికి పంపినట్టు తెలుస్తుంది.
ALSO READ:కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!
ఏది ఏమైనా ఇపుడు కొండా సురేఖ వ్యవహరం మాత్రం ఇటు గాంధీ భవన్‌లోనూ, అటు రేవంత్ ప్రభుత్వంలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. చూడాలి ముందు ముందు ఈ బర్తరప్ ఎలాంటి సంచలనాలకి దారి తీస్తుందో !