Revanth reddy :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తి అయిన సందర్భంగా దూకుడు పెంచారు సీఎం రేవంత్ .ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట ముసారంభాగ్ వంతెనని ప్రారంభించిన రేవంత్ రెడ్డి తాజాగా చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇపుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు కేవలం నామమాత్రంగా కొబ్బరికాయలు కొట్టి ప్రకటనలతో చేతులు దులుపుకున్నారని, ఫ్లైఓవర్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా సరిగ్గా ఖర్చు చేయకుండా పక్కన పడేసారని విమర్శించారు సీఎం.
కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా నిధులు కేటాయించి, పనులను పరుగులు పెట్టించి ఈ డ్రీమ్ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.ఇక అందరు దీన్ని ఓల్డ్ సిటీ అంటుంటారని,కాని ఇది ”ఓల్డ్ సిటీ కాదు నగర సంస్కృతికి జీవం పోసిన ఒరిజినల్ సిటీ” అని అనడంతో ఒక్కసారిగా చప్పట్లతో సభ మారుమ్రోగిపోయింది.
ఇక హైదరాబాద్ లోని ప్రతి గల్లీ, ప్రతి వీధి తన వేళ్లపై ఉన్నాయని, ఇక్కడి సమస్యలన్నీ తనకు మజ్జిగ లో వెన్నలా తెలుసని గతాన్ని గుర్తు చేసుకున్నారు రేవంత్.ఇక ఓల్డ్ సిటీ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని భరోసా ఇచ్చారు సీఎం.
స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరిన ప్రతి ఒక్క అభివృద్ధి పనికి తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అధికారులను నేరుగా మైకులోనే ఆదేశించడం విశేషం.ఇక స్థానిక ఎమ్మెల్యే అడిగిన కాలేజీ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు అడిగితే, ఏకంగా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు సీఎం రేవంత్.
నిధుల కేటాయించడమే తమ వంతని,సరిగ్గా ఏడాదిన్నర వ్యవధిలో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని స్పష్టం చేశారు.మొత్తంగా విద్య రంగంపై ఎంత ఖర్చు చేయడానికైనా తమ ప్రభుత్వం వెనకాడదని హామీ ఇచ్చారు రేవంత్
ఇక రాజకీయ సిద్ధాంతాలు,భావజాలాలు వేరైనా దేశభక్తి విషయంలో అందరం ఒక్కటేనని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు రేవంత్ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ హిందుస్థాన్‌కు సంపూర్ణ మద్దతుగా నిలిచి తన నిజమైన దేశభక్తిని చాటుకున్నారని ఆకాశానికి ఎత్తేశారు.
హిందూ-ముస్లింలు కలసికట్టుగా ముందుకు సాగినప్పుడే తెలంగాణ అనుకున్న స్థాయిలో ప్రగతి సాధిస్తుందని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేశారు.
ఇక హైదరాబాద్ వాసులు కేబుల్ బ్రిడ్జి అందాలు చూడాలంటే ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువు వరకు వెళ్లాల్సి వస్తోందని, ఇకపై ఆ అవసరం లేకుండా మీరాలం చెరువులో భారీగా 3 కిలోమీటర్ల మేర ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని చెబుతూ అక్కడున్న వారిని ఆనందపరిచారు రేవంత్ రెడ్డి.
ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో రైలు ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నామని వచ్చే ఎన్నికల నాటికి మెట్రోలోనే వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని కాన్ఫిడెన్స్ చూపించడం విశేషం.
అలాగే నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణ ప్రాజెక్టు నగరం రూపురేఖలను మార్చేస్తుందని వివరించారు.
ఓల్డ్ సిటీలోని ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నగరంలో ఏకంగా లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసి, నైట్ ఎకానమీని విపరీతంగా ప్రోత్సహించాలని చూస్తుంటే, బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ALSO READ:సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR
అయినప్పటికీ సంక్షేమాన్ని ఆపేదేలేదని, ఇప్పటికే ప్రతి పేద ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కేవలం రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలని, ఎన్నికలు ముగిశాక అభివృద్ధి ఒక్కటే తమ ఎజెండా అని, భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు.