KTR On Hydra: పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయమా? అంటూ హైడ్రా పనితీరుపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. మూసీ వల్ల, హైడ్రా వల్ల ఎంతో మంది బాధితులుగా మారారన్నారు. చాంద్రాయణ గుట్టలో స్కూల్ కూడా కూలగొట్టారన్నారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా కట్టడాలే కనిపించేవని, హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించామన్నారు. వైట్ హౌస్‌ను తలదన్నేలా సచివాలయం కట్టామన్నారు.
“దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు కట్టుకున్నాం. ప్రతి జిల్లాలో కలెక్టరేట్‌లు కట్టుకున్నాం, నీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కొత్త నిర్మాణాలు చేసుకున్నాం. కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఒక్క ఇటుక పెట్టలేదు. అన్నీ కూలగొట్టడమే. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయానికి ఎంతో మంది బాధితులుగా మారారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రానుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం” -కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒక ఇంటి గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు, ఇంతలో బుల్డోజర్ వచ్చి కూలగొట్టిందన్నారు. మూడేళ్ల చిన్నారి భోజనం లేకుండా ఏడ్చిన పరిస్థితి, హైడ్రా బాధితుల బాధ అర్ధం చేసుకోవాలన్నారు. హైడ్రాపై భట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేషన్ ఇచ్చారన్నారు. పేదవాడి ఇంటికి బుల్డోజర్ వచ్చింది, ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పేదలు కోరుకునేది ఒక్కటే కూడు గూడు గుడ్డ.. అలాంటి పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందని మండిపడ్డారు.
ప్రభుత్వానికి అంతా సమానమైతే పెద్ద వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదని కేటీఆర్ ప్రశ్నించారు. వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదన్నారు. పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్లని నిలదీశారు. పేదల ఇళ్లు కూలగొట్టలేదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారని కానీ పేపర్లు, కోర్టు తీర్పులు ఉన్నా హడావుడిగా ఇళ్లు కూలగొడుతున్నారని విమర్శించారు. టైమ్ ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని, ఇలా చేస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు. ఫుల్ ట్యాంక్ లెవల్లో కడితే ఎవరిని వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారన్నారు.
‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. ఆయన ఇంటికి వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్ చేస్తారా? మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తుందా? పేదలకు అసలు టైమ్ ఇవ్వరు.. పెద్దలకు మాత్రం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా అవకాశం ఇస్తారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చే దైర్యం హైడ్రాకు ఉందా?. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి.. వారికి నోటీసులు ఇచ్చే దమ్ము అధికారులకు ఉందా? పెద్ద పెద్ద ఫామ్ హౌజ్‌లు, ఇల్లులు కట్టుకున్నా అడిగేవారు లేరు’ -కేటీఆర్
మంత్రులు, పెద్ద పెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ విమర్శించారు. పేదల పైకి బుల్డోజర్లు పంపిస్తారని, అందుకే హైడ్రాను వ్యతిరేకిస్తున్నామన్నారు. బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో రాహుల్ గాంధీ మాట్లాడారని, అదే తెలంగాణలో బుల్డోజర్ ఇళ్లను కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.