Promotion Scam: స్వేచ్చ బ్యూరో: ప్రమోషన్ కోసం ఏకంగా ఓ ఉద్యోగి కులాన్నే మర్చేసిన ఘటన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిందనే చర్చ జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ల్యాబ్ టెక్నిషియన్లకు పదోన్నతులు లభించడం లేదు. గ్రేడ్-2గా చేరిన వారు అదే హోదాలో రిటైర్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి.కానీ ఇటీవల ఎల్టీ పదోన్నతుల్లో కదలిక రాగా, డీహెచ్ ఆఫీస్ అధికారులు దీనిని ఒక పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ నెల 18న విడుదల చేసిన జోన్-4 ల్యాబ్ టెక్నిషియన్స్ సీనియారిటీ జాబితాలో ఈ భారీ అక్రమం వెలుగుచూసింది. 1998 నియామక పత్రం ప్రకారం బీసీ-ఏ సామాజిక వర్గానికి చెందిన ఓ అభ్యర్థిని, తాజా పదోన్నతుల జాబితాలో ఎస్టీగా చూపించారు. దీంతో సదరు అభ్యర్థికి సీనియారిటీలో అడ్డదారిలో టాప్ స్థానం దక్కింది.
ఇది పొరపాటున జరిగింది కాదని, కింది స్థాయి క్లర్క్ నుండి పైస్థాయి అధికారుల వరకు అందరి ప్రమేయంతో, భారీగా చేతులు మారిన డబ్బు కోసమే ఈ కులమార్పిడి దందాకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా, “తప్పేం జరగలేదు.. బదిలీల ప్రక్రియ అయ్యాక చూస్తాం” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండటం గమనార్హం.మరోవైపు ఈ అక్రమాలు ఇక్కడితో ఆగలేదు. గతంలో ల్యాబ్ అటెండెంట్లుగా ఉన్న కొందరిని ప్రమోషన్లపై ల్యాబ్ టెక్నిషియన్లుగా తీసుకున్నారు. నిబంధనల ప్రకారం వీరు ఏడాది పాటు ఎంఎల్, డీఎంఎల్ కోర్సులు పూర్తి చేస్తేనే తదుపరి పదోన్నతికి అర్హులవుతారు. కానీ ఎలాంటి శిక్షణ, కోర్సులు చేయని కొంతమంది వొకేషనల్ అభ్యర్థులను కూడా ప్రస్తుత ప్రమోషన్ల జాబితాలో చేర్చేశారు. ఒక్క జోన్-4లోనే ఇలాంటి ఐదుగురికి చోటు కల్పించారంటే, మిగిలిన జోన్లన్నింటినీ కలిపితే ఎంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోవచ్చని వైద్యవర్గాలు మండిపడుతున్నాయి.
వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకైనా, పదోన్నతులకైనా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు అత్యంత కీలకం. అభ్యర్థి ఏ కోటా కింద ఎంపికయ్యారనేది అపాయింట్‌మెంట్ లెటర్‌లోనే స్పష్టంగా పేర్కొంటారు. కానీ, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల (డీహెచ్) కార్యాలయంలో మాత్రం నిబంధనలకు పాతరేశారు. ల్యాబ్ టెక్నిషియన్ల పదోన్నతుల ప్రక్రియలో ఏకంగా ఓ అభ్యర్థి కులాన్నే మార్చేసి వింత పోకడకు తెరలేపారు. బీసీ-ఏ కేటగిరీకి చెందిన ఒక అభ్యర్థిని ఏకంగా ఎస్టీ లంబాడ జాబితాలోకి మార్చేసి, సీనియారిటీలో టాప్-10లో చోటు కల్పించడం వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం కూడా స్పందించడకపోవడం విచిత్రమంటూ మెడికల్ యూనియన్లు మండిపడుతున్నాయి.
Also Read: బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా
ప్రజారోగ్య కార్యాలయం ప్రస్తుతం అడ్డగోలు దందాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ ప్రతీ పనికీ ఒక రేట్ ఫిక్స్ అయిందని ఉద్యోగులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఆ ‘మామూళ్లు’ సమర్పిస్తే నెలల తరబడి మూలనపడ్డ ఫైళ్లు కూడా గంటల్లో క్లియర్ అవుతాయి.కొత్త ఉద్యోగుల ప్రొహిబేషన్ తర్వాత సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలంటే ఒక్కొక్కరి నుంచి రూ. 3 వేల నుండి రూ. 5 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక వార్షిక ఇంక్రిమెంట్ల కోసం రూ. 5 వేల నుంచి 10 వేలు దండుకుంటున్నట్లు స్వయంగా ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఇక సరెండర్ లీవ్, మెడికల్ లీవ్ల మంజూరుకు కొర్రీలు పెడుతూ లక్షలు దండుకుంటున్నారు. ప్రధానంగా విజిలెన్స్, నర్సింగ్ విభాగాల్లో అవినీతి పరాకాష్టకు చేరిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఏడుగురు ఫార్మసిస్టులను నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌కు డిప్యూటేషన్‌పై పంపడం, హైదరాబాద్, రంగారెడ్డి సీఎంఎస్ స్టోర్లలో తీవ్ర అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ కేసులు ఉన్నవారిని వేసి లక్షలు వసూలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆఫీస్ సూపరింటెండెంట్ నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమోషన్ల వెనుక రూ. అరకోటి వరకు వసూళ్లకు పాల్పడ్డారని ఏకంగా హెల్త్ సెక్రటరీ, వైద్య మంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి. దశాబ్ద కాలంగా విధులకు దూరంగా ఉన్న ఓ డాక్టర్‌కు లక్షలు వసూలు చేసి పోస్టింగ్ ఇవ్వడంపై ఏడుగురు ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
Also Read: కాకరేపుతున్న తెలంగాణ పాలిటిక్స్.. మళ్లీ ప్రాంతీయ బేస్‌లో పొలిటికల్ వార్..?
2024 నుంచి ఇప్పటివరకు డీహెచ్ ఆఫీసులో ఎన్నో అవినీతి గుట్టుమట్లు రచ్చకెక్కాయి. హెల్త్ సెక్రటరీ విచారణలు చేయడం, మెమోలు, షోకాజ్ నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారింది తప్పా, ఇప్పటివరకు ఒక్కరిపై కూడా కఠిన చర్యలు తీసుకోలేదు. దీంతో “తమకేం కాదు.. పైస్థాయి అధికారుల అండదండలు ఉన్నాయి” అన్న ధీమాతో క్లర్క్ నుండి పేషీ వరకు వసూళ్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. సాక్షాత్తు హెల్త్ డైరెక్టర్ కు కూడా మూడు మోమోలు జారీ అయ్యాయి. ఇంత జరుగుతున్నా…హెల్త్ సెక్రటరీ కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇక కోఠి క్యాంపస్‌లోని డీహెచ్, డీఎంఈ, టీవీవీపీ వంటి హెచ్‌ఓడీ ఆఫీసుల్లో చేరిన సిబ్బందికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ (రాష్ట్రపతి ఉత్తర్వులు) సర్వీస్ రూల్స్ ప్రకారం పదవీ విరమణ వరకు అక్కడే పోస్టింగులు ఉంటాయి. ఏ తప్పు చేసినా సీటు మార్చడమే తప్ప బదిలీ చేసే వీల్లేదు. ఇదే అక్కడి సిబ్బందికి ఆయుధంగా మారిందనే చర్చ ఉన్నది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, శిక్షగా ఆసిఫాబాద్ లాంటి సుదూర జిల్లాలకు డిప్యూటేషన్‌పై పంపాలని సీనియర్ వైద్య సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు సవరణలు తీసుకువచ్చి, హెచ్‌ఓడీ ఆఫీసుల్లో శాశ్వత పోస్టింగులు లేకుండా బదిలీల చట్టాన్ని కఠినతరం చేస్తేనే కోఠి సామ్రాజ్యంలో వేళ్లూనుకున్న అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?