టీఆరెస్ పార్టీ అధ్యక్షురాలు కవితకు కేబినెట్‌లో జరిగిన అంతర్గత విషయాలు ఎలా తెలిశాయి? సర్కార్ ఇకపై రైతులు పండించే ఏ పంటను కొనుగోలు చేసే స్థితిలో లేదని నిర్ణయం తీసుకున్నదా? దీని కోసమే ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని సర్కార్ వేసిందా? ఈ విషయం బయటకు రానీయకుండా చేసిందా? మరి కవితకు ఎలా తెలిసింది? అసలు ఈ విషయం వాస్తవమేనా??
తాజాగా కవిత ఈ ఇష్యూకు సంబంధించి చేసిన కామెంట్లు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆమె ఓ మీటింగులో ఈ కామెంట్స్ చేశారు. ఆమె ఏమన్నదో ఆమె మాటల్లోనే….ఇప్పుడున్న ప్రభుత్వాలు కనీసం ప్రజలకు నిజం కూడా చెప్పటం లేదు.. ఎందుకంటే మొన్న జరిగిన కేబినేట్ సమావేశంలో రైతులు పండించే పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి అన్నారు.. ఇది ఇన్ సైడర్ ఇన్ఫర్మేషన్. కానీ దీని గురించి ఏ మీడియా రాయలేదు..
ప్రభుత్వం ధైర్యంగా ప్రజలకు నిజం చెప్పలేదు. ముగ్గురు మంత్రులతో మాత్రం ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ ఈ ఏడాది మాత్రం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది…అంటే వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని కూడా ప్రభుత్వం చెప్పటం లేదు….! ఇవీ ఆమె అన్న మాటలు. ఈ విషయం ఆమెకు ఎలా తెలిసింది. కేబినెట్‌లో ఎవరైనా లీకు చేశారా? లీక్ చేస్తే ఎవరా మంత్రి..? అసలు ఇది నిజమేనా? మీడియా రాయలేదని చెప్పారంటే.. ఆ విషయం మీడియాకు కూడా తెలిసిందా? అయితే ఎవరైనా విలేకరి ఆమెకు చెప్పారా? ఎవరు చెప్పినా.. అంతర్గత విషయం బయటకు పొక్కినట్టే కదా! మరి ఆ లీకువీరుడెవరు? ఇప్పుడీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కవిత ఆరోపించిన పంట కొనుగోలు అంశంపై సర్కార్ చేతులెత్తేసిన విషయంపై చర్చించుకుందాం. నిజంగా ఒకవేళ సర్కార్ అదే నిర్ణయానికి వస్తే.. అది సాధ్యమేనా? ప్రతీ వేదిక మీద సీఎం.. ఈ విషయంలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వరేసుకుంటే ఉరేసుకోవాల్సి వస్తుంది.. మేము కొనుగోలు చేయమని కేసీఆర్ అప్పుడు చెప్పారని..మేము ప్రతి గింజా కొంటున్నామని చెబుతూ వస్తున్నారు. మరిప్పుడు ఉన్నపళంగా మాతో కాదు.. అని చేతులెత్తేసే పరిస్థితి ఉందా? ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. పండించిన పంటల కొనుగోలు ..ప్రధానంగా వరిని కొనగోలు చేయకపోతే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? రైతులు తిరగబడరా? ఇదంత సులువేం కాదు.
మరి కవిత ఎలా అన్నారు ఈ మాటలు? తను అబద్దం ఆడాల్సిన పనేం లేదు. ఆ లీకు నిజమేనా? ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి, కేబినెట్ సమావేశం తరువాత అధికారికంగా వెల్లడించే విషయాలతో పాటు అంతర్గతంగా చర్చకు వచ్చే అంశాలూ ఉంటాయి. కొన్ని బయటకు చెప్పని నిర్ణయాలూ ఉంటాయి. కానీ ఇవీ ఒక్కొక్కప్పుడు బయటకు వచ్చేస్తుంటాయి. అందులో ఎవరో ఒకరు మీడియాతో సన్నిహితంగా ఉండే మంత్రులు.. ఇతర పార్టీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించే లీడర్లు లీక్ చేస్తూ ఉంటారు. ఆ లీకులు సర్కార్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టే విధంగా ఉన్నప్పుడే అసలు సమస్య. ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి.
రేవంత్ సర్కార్ ఏర్పడిన తరువాత కొన్ని విషయాలు ఇలా బయటకు వచ్చినవే. వెంటనే ఈ విషయాలు బీఆరెస్ ముఖ్య నేతలకు చేరడం.. వాళ్లు దీనిపై వెంటనే స్పందించి సర్కార్‌ను నిలదీయడం చేశారు. అవాక్కవ్వడం సర్కార్ వంతైంది. అయినా ఇప్పటికీ పరిస్థితి కంట్రోల్‌లో లేదు. అది వేరే అంశం. అక్కడ ఏపీలో కూడా కేబినెట్ లీకుల విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. ఎంతలా అంటే..! ఏకంగా చంద్రబాబు .. మంత్రులకు వార్నింగ్ ఇచ్చేదాకా పోయింది పరిస్థితి. మంత్రులను తొలగించేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్ హయాంలో ఇలా లీకులు ఇవ్వడం వల్లే ఓసారి కేబినెట్ ను పూర్తిగా రద్దు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారంటే.. ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ తెలంగాణలో మంత్రులు, సర్కార్ మధ్య సమన్వయం కొరవడింది. అది చాలా సందర్బాల్లో నిరూపితమైంది కూడా. కాంగ్రెస్‌లో అది కామన్‌గా ఎక్కువే ఉంటుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు.. ప్రజా వ్యతిరేకత కూడా తోడవుతున్నప్పుడు సమన్వయం పాటించడం.. ఏకతాటిపై నడిపించడం అనివార్యం. అక్కడ సర్కార్ ఫెయిలవుతుందా? కవిత లేవదీసిన కేబినెట్ లీకుల అంశం.. సర్కార్ సీరియస్‌గా తీసుకోకపోతే నష్టమే.