బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం.. ఇదో సినిమా టైటిల్! అచ్చంగా ఇలాగే ఉంది కేటీఆర్ వరంగల్‌లో తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సు. ఏదో అనుకున్నారు అది ఎటో పోయింది.. చివరకు తిట్ల పురాణాలకు దిగి నువ్వెంత అంటే నువ్వెంత అని దగ్గర బీఆరెస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా మాటల దాడి జరుగుతుంటే.. మధ్యలో అనుకోకుండా.. సంబంధం లేకుండా టింగున ఊడిపడ్డాడు బండి సంజయ్. ఆ సినిమా రసవత్తరంగా సాగుతుంటే.. ఒకర్నొకరు రంజుగా తిట్టుకుంటుంటే.. అక్కడ థియేటర్‌లో జనం ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో ఈ పాత్రెందుకు వచ్చిందబ్బా అని అంతా అనుకుంటుండగా..అక్కడ ఫైటింగ్ సీన్ మారింది.
మధ్యలో కాంగ్రెస్ సైడ్ అయ్యింది. బీఆరెస్, బీజేపీ మధ్య ఫైటింగ్ సీన్ స్టార్ట్ అయ్యింది. ఇది చూస్తున్న ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదేం సినిమా. ఈ కథ ఎటు పోయి ఎటు తిరిగి.. ఎటు ఎండ్ కాబోతుంది? దీని క్లైమాక్స్ ఏంటీ? ఇందులో ఎవరు విలన్..? ఎవరు హీరో..? మధ్యలో వచ్చింది కమేడియనా..? స్పెషల్ అప్పీయరెన్సా..? ప్రత్యేక అతిథి పాత్రనా..? ఏం అర్థం కాక బుర్ర గోక్కుంటూ ఉంటే… అక్కడ ఫైటింగ్ సీన్స్ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. కార్ల అద్దాలు పగలగొట్టుకుంటున్నారు. ఆఫీసుల మీద దాడి చేసుకుంటున్నారు. కంకర రాళ్లతో తలలు పగులగొట్టేందుకు ఏకంగా ఓ ట్రాక్టర్ కంకర లోడ్ కూడా వచ్చేసింది. అరరే.. ఇంట్రవల్ కూడా కాలేదు.. అప్పుడే క్లైమాక్స్ రేంజ్ ఫైటింగా? ఫ్యాక్షన్ పోరాట దృశ్యాలు కూడా ఇక్కడ జూజూపీ అనేటట్టే ఉన్నాయే! అని ఆసక్తిగా చూడటం మొదలు పెట్టాడు ప్రేక్షకుడు.
ఆ వెంటనే మరో డౌట్ వచ్చింది. ఇక్కడ ఎవరు ఎవరి మీద దాడి చేసుకుంటున్నారు? నేనెవర్ని చూడాలె? మెయిన్ క్యారెక్టర్లు సైలెంట్ అయి .. మధ్యలో వచ్చిన ఆర్టిస్టులు తెగ తన్నుకుంటున్నారే..! సరే, సరే ఏదో ఒకటి తన్నుకోవడం కావాలె.. ఇంకా ఇంకా కొట్టుకోండి.. తన్నుకోండి.. తిట్టుకోండని ఆవేశంగా హాలులో కూర్చీలోంచి లేచి లేచి మరీ అరుస్తున్నారు. అవును..ఈ భీకర పోరాట దృశ్యాలకు కారణమైన కేటీఆర్ ఎక్కడ..? కానరాడే..! తొడలు చరిచి.. నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా.. అసలు నువ్వు … అని గలీజు తిట్లు తిట్టిన అద్దంకి ఎక్కడికి పోయిండు? అవును ఇది రైతుల గురించి జరిగిన పోరాటం కదా.. మరి ఇప్పుడు వాళ్ల డైలాగుల్లో రైతుల ముచ్చట్లు రావడం లేదెందుకు? తంబాకు నువ్వు తిన్నవంటే.. కాదు నువ్వు డ్రగ్స్ తీసుకున్నావ్.. అరే నువ్వు తంబాకులో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తింటావు.. అందుకే ఆ జుట్టు ఊడి బోడి గుండయ్యింది..! అరే నీ చిన్నదొరకే ఆ డ్రగ్స్ అలవాటు.. కాదు కాదు గా సీఎంకు కూడా డ్రగ్స్ అలవాటు.. ! అరేయ్.. మధ్యలో సీఎం ఎందుకొచ్చిండురా! కాదు కాదు.. ముగ్గురికి డ్రగ్స్ టెస్టు చేపియ్యాలె.. వస్తావా? రా! చూస్కుందామా? డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామా? గాంజా గుంజేడిది నువ్వో నేనో తేల్చుకుందామా? ఈ కాంపాండ్‌లకెళ్లి ఒకడు.. ఆ కాంపౌండ్‌ల కెళ్లి ఇంకొకడు అరుసుకుంటున్నారు.
వార్నింగులు ఇచ్చుకుంటున్నారు. అరేయ్… ఈ సినిమాలో ఇన్ని ట్విస్టులున్నయేందిరా? అన్నాడు నెత్తి గోక్కుంటు. అవును.. ఇది యాక్షన్ సినిమానా? థ్రిల్లరా? క్రైమా? డ్రామానా? మెలోడినా?? సస్పెన్సా..? అన్నీ క్వశ్చన్ మార్కులే వాడి ముఖం మీద. అవేమీ కావురా.. ఇది నాన్సెన్స్…! అని భుజం మీద ఉన్న ఆకుపచ్చ కండువాను ఓసారి దులుపుకుని హాలు నుంచి వెనక్కి చూడకుండా వెళ్లిపోయాడు ఆ ప్రేక్షకుడు. కాదు కాదు రైతు…!