HYDRAA: కూకట్‌పల్లికి నల్ల చెరువును మణిహారంగా హైడ్రా రూపుదిద్దింది. ఈ నెలాఖరుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. చెరువును పూర్తి స్థాయిలో తవ్వి వర్షపు నీటితో నింపిన హైడ్రా.. ఆ పరిసరాలను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం పరిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎక్కడా అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్టం చేయాలన్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఒకటికి రెండు ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్దవాళ్లు సేద దీరేలా గజబో (విశ్రాంతి మందిరం)లు నిర్మించాలని.. చెరువుకు నలువైపులా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటాలని.. ఇక్కడికి వస్తే ఆరోగ్యం అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఇవన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
6 నెలల్లో ఆహ్లాదంగా మారిన నల్ల చెరువు..
ఆక్రమణలకు గురై నిర్మాణ వ్యర్థాలతో నిండి.. మురికి కూపంగా మారిన కూకట్ పల్లిలోని నల్ల చెరువు సరికొత్త జలాశయంగా కనిపిస్తోంది. ఆరు నెలల్లో ఆహ్లాదంగా మారిన నల్ల చెరువు.. ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా మారింది. అక్కడ నివాసం ఉన్న వాళ్లే అచ్చెరవొందేలా కూకట్‌పల్లి నల్ల చెరువు తయారయ్యింది. బోటు షికారుకు చిరునామా అయ్యింది. చెరువు అభివృద్ధిపట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాంతాల్లో ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారింది. ఉదయం సాయంత్రం వందలాది మంది ఇక్కడకు చేరుకుని సేదదీరుతున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది…నేడు ఎలా అభివృద్ధి చెందింది అనేది చూడాలనుకుంటే కూకట్‌పల్లి నల్లచెరువును సందర్శించాలని హైడ్రా నగర ప్రజలను ఆహ్వానిస్తోంది.
16 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకూ..
కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలతో 16 ఎకరాలుగా మిగిలిపోయింది. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో 30 ఎకరాలకు ఈ చెరువును హైడ్రా విస్తరించింది. చెరువలోకి జరిగి ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డులను హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడంతో 4 మీటర్ల లోతు పెరిగింది. అప్పుడు కాని దుర్గంధం దూరమవ్వలేదు. కేవలం 6నెలల్లో 30 ఎకరాల మేర చెరువు తయారయ్యిందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. మురుగు నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెరువు చెంతనే బతుకమ్మ ఆటలకు ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. బతుకమ్మలను గంగలో కలపడానికి ప్రత్యేకంగా చిన్న కుంటను అందుబాటులోకి తెస్తున్నారు.
ఇలా అభివృద్ధి చేస్తారని తాము ఊహించలేదు: కిరణ్
కూకట్‌పల్లి నల్ల చెరవును ఇలా అభివృద్ధి చేస్తారని తాము ఊహించలేదని స్థానికుడు కిరణ్ అన్నారు. ‘‘కబ్జాల చెర నుంచి బయటపడింది. మురుగును వదిలించుకుంది. పేరుకుపోయిన చెత్తను తొలగించుకుంది. ఎన్ని ప్రయాశలో.. ఎన్ని ఎదురు దెబ్బలో.. మరెన్ని విమర్శలో.. వీటన్నిటినీ తట్టుకుని పని చేసిన హైడ్రా సిబ్బందికి అభినందనలు. హైడ్రా పని తనానికి నిదర్శనంగా నిలిచింది.’’ అని అన్నారు.
అహ్లాదంగా మారింది: ఓబులేసు
దొమలతో దుర్గంధంగా ఉండే ఈ ప్రాంతం ఆహ్లాదంగా మారిందని స్థానికుడు ఓబులేసు హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇంట్లోంచి బయటపడితే నేరుగా ఇక్కడికి వచ్చేస్తున్నాం. చెరువు ఆక్రమణలు తొలగించిన నాటి నుంచి పూర్తి స్థాయిలో అభివృద్ధిని కళ్లారా చూశాం. హైడ్రా కమిషనర్ ఇక్కడికి అనేక సార్లు వచ్చారు. చెరువు అభివృద్ధిని దగ్గరగా పరిశీలించారు. హైడ్రా ఈ కార్యక్రమాన్ని ఓయజ్ఞంలా చేసింది. చెరువును చూస్తే చూడ ముచ్చటగా అనిపిస్తోంది.’’ అని అన్నారు.
భావితరాలకు నల్ల చెరువు బహుమతి: రామచంద్ర రావు.
భావితరాలకు నల్ల చెరువు ఒక బహుమతి అని స్థానికుడు రామచంద్ర రావు అన్నారు. ‘‘చెరువును చాలా బాగా తీర్చిదిద్దారు. చెరువులో 4 మీటర్ల లోతు పూడికను తీసి ఎక్కడా దుర్గంధం ఆనవాళ్లు లేకుండా చేశారు. చెరువు చుట్టూ పిల్లలు ఆడుకునేందుకు మంచి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతానికి ఇది పిక్నిక్ స్పాట్‌లా తీర్చిదిద్దాలని హైడ్రాను కోరుతున్నాం.’’ అని తెలిపారు.