Magic Figure: దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ‘మ్యాజిక్ ఫిగర్’ అనేది ప్రధాన అంశంగా మారిపోతుంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజలు, టీవీ చర్చల్లో ఈ పదం హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ప్రస్తుతం తమిళనాడు పాలిటిక్స్ ఈ ‘మ్యాజిక్ నెంబర్’ చుట్టూ తిరుగుతుండటంతో మరోమారు దీనిపై పెద్ద ఎత్తున చర్చ మెుదలైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ‘మ్యాజిక్ ఫిగర్’ లేదా ‘మ్యాజిక్ నెంబర్’ అంటే ఏంటి? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది ఎందుకు తప్పనిసరి? దీని వెనుక ఉన్న లెక్కలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాజ్యాధికారానికి మ్యాజిక్ ఫిగర్ అనేది ఆయువు పట్టు వంటిది. అయితే మ్యాజిక్ ఫిగర్ అనేది స్థిరమైన నెంబర్ కాదు. ఆయా సభల (లోక్ సభ, రాష్ట్రాల శాసససభలు) మెుత్తం స్థానాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక భాషలో ఈ మ్యాజిక్ ఫిగర్ ను ‘సాధారణ మెజారిటీ’ (Simple Majority) అని కూడా అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక పార్టీ లేదా కూటమి.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సభలోని మొత్తం సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు తప్పనిసరి. అంటే మొత్తం సీట్లలో 50% కంటే ఒక్క సీటు ఎక్కువున్నా.. వారు మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకున్నట్లే లెక్క. మెుత్తం స్థానాలను బై చేసి.. వచ్చిన అంకెకు ఒక సీటును జతచేయడాన్ని ‘మ్యాజిక్ ఫిగర్ సూత్రం’గా చెబుతుంటారు (Magic Number = Total Number of Seats / 2) + 1).
సాధారణంగా చాలా మందికి ఈ ‘మ్యాజిక్ ఫిగర్’ ఉద్దేశ్యం అర్థం కాదు. దీనిని అనాదిగా పాటిస్తున్న సంప్రదాయంగా మాత్రమే చూస్తుంటారు. కానీ ఇది చాలా తప్పు. మ్యాజిక్ నెంబర్ అనేది.. ప్రజాస్వామ్య స్థిరత్వానికి వెన్నెముక లాంటిందని రాజ్యాంగ సృష్టికర్తలు కొనియాడారు. మ్యాజిక్ ఫిగర్ ను తప్పనిసరి చేయడం వెనుక ఉన్న 3 ప్రధాన ఉద్దేశాలను సైతం వారు వెల్లడించారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎప్పుడూ శాసనసభకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ లేదా రాష్ట్రపతి ఒక నాయకుడిని ఆహ్వానించినప్పుడు, వారు సభలో ‘విశ్వాస తీర్మానం’ (Vote of Confidence) ద్వారా తమ మెజారిటీని నిరూపించుకోవాలి. కనీసం 50% కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు లేని ప్రభుత్వం నైతికంగా, చట్టబద్ధంగా అధికారంలో కొనసాగే హక్కు ఉండదు.
ఏ పార్టీ అయితే సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ను సాధిస్తుందో.. దానిని ‘మెజారిటీ ప్రభుత్వం’ (Majority Government) అంటారు. ఇటువంటి ప్రభుత్వాలు సాధారణంగా స్థిరంగా ఉంటాయి. మిత్రపక్షాల నుంచి మద్దతు ఉపసంహరణ వంటి బెదిరింపులు వీటికి ఉండవు. తద్వారా ప్రభుత్వం కేవలం మనుగడ కోసం పాకులాడకుండా.. పరిపాలనపై, అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా లేదా బడ్జెట్ అయినా సభలో ఆమోదం పొందాలంటే మెజారిటీ సభ్యుల ఓట్లు తప్పనిసరి. ఒకవేళ అధికార పార్టీకి మ్యాజిక్ ఫిగర్ లేకపోతే.. ప్రతిపక్షాలు బిల్లులను అడ్డుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పాలనా పరమైన ఇబ్బందులు (Policy Paralysis) ఏర్పడి.. ప్రజలకు అవసరమైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకం ఏర్పడవచ్చు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ ను రాజ్యాంగ నిర్మాతలు తప్పనిసరి చేశారు.
ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాకపోతే.. దానిని ‘హంగ్ పార్లమెంట్’ (Hung Parliament) లేదా ‘హంగ్ అసెంబ్లీ’ (Hung Assembly)గా పేర్కొంటారు. అలాంటి సందర్భాల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీలు ప్రధానంగా 3 రకాల ప్రయత్నాలు చేస్తాయి. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తాయి. అవి ఏంటంటే..
హంగ్ ఏర్పడిన సందర్భాల్లో ఒకే రకమైన భావజాలం ఉన్న పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తాయి. వీరి మొత్తం సీట్ల సంఖ్య మ్యాజిక్ ఫిగర్ దాటితే ఆటోమేటిగ్గా ప్రభుత్వం ఏర్పడుతుంది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.
కొన్ని సందర్భాల్లో చిన్న పార్టీలు.. అత్యధిక సీట్లు సాధించిన పార్టీకి బయట నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాయి. కీలక సమయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని హామీ ఇస్తాయి. అలాంటప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడటాన్ని పలు రాష్ట్రాల్లో గతంలో చూశాం.
భారత రాజకీయాల్లో ఈ తరహా ప్రభుత్వాలను చాలా అరుదుగా చూస్తుంటారు. మెజారిటీకి దూరంగా ఉన్న పార్టీ.. ప్రధాన పార్టీలతో కాకుండా.. చిన్న స్థానాలు తెచ్చుకున్న పార్టీలతో జత కట్టేందుకు యత్నిస్తుంది. 3-5 స్థానాలు సాధించిన చిన్న పార్టీల మద్దతు కోరి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అయితే ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పనిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. చిన్నపార్టీల సభ్యులు ఏమాత్రం ప్రలోభాలకు లోనైనా వెంటనే ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంటుంది. మొత్తంగా చూస్తే.. ప్రజాస్వామ్యానికి మ్యాజిక్ ఫిగర్ అనేది ‘గుండె చప్పుడు’ (Heartbeat) అని చెప్పవచ్చు.
Also Read: తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు.. గవర్నర్‌తో విజయ్ మరోసారి భేటీ, ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్