Emotional Action Thriller: ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ చేయని నేరానికి నాలుగేళ్లు జైలులో ఉంటే… బయటకు వచ్చిన తర్వాత అతని జీవితం ఎలా ఉంటుంది ? భార్య దూరమైపోయి, తన కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిస్తే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు ? చేతిలో డబ్బు లేకపోయినా, కొడుకు ఆపరేషన్ కోసం ఏకంగా చావో రేవో తేల్చుకునే ఫైట్‌లోకి దిగితే ? గెలిస్తే భారీ ప్రైజ్ మనీ… ఓడిపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ తండ్రి తన కొడుకు కోసం చేసే పోరాటమే ‘లయన్ ఫిస్ట్’ (Lion Fist). మరి ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అంటే…
జో మంచి మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. అయితే డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఓ గొడవ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ కేసులో తన భార్య చేసిన తప్పును తనపై వేసుకుని జో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఎదురయ్యే నిజాలు మరింత బాధాకరంగా ఉంటాయి. భార్య అతన్ని వదిలేసి, క్రూరమైన డ్రగ్ లార్డ్ బచ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అంతేకాదు ఆమెకు జో కొడుకు కూడా ఉంటాడు. జో తన కొడుకు ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్నాడని తెలుసుకుంటాడు. బాబు ప్రాణాలు నిలవాలంటే ఖరీదైన ఆపరేషన్ చేయాలి. కానీ నాలుగేళ్లు జైలులో ఉన్న జో దగ్గర అంత డబ్బు ఉండదు.
తన గతాన్ని తలుచుకుంటూ కూర్చోవడం కంటే, కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో జోకు ఓ రహస్య మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ గురించి తెలుస్తుంది. ఇది సాధారణ పోటీ కాదు. వివిధ ఫైటింగ్ స్టైల్స్‌కు చెందిన అత్యంత ప్రమాదకరమైన యోధులు ఇందులో పాల్గొంటారు. రింగ్‌లో గెలిచిన వారికి 100,000 డాలర్ల భారీ ప్రైజ్ మనీ దక్కుతుంది. తన కొడుకు ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు దొరికే ఏకైక మార్గంగా జోకు ఈ టోర్నమెంట్ కనిపిస్తుంది. అయితే గెలవడం అంత సులభం కాదు. పోటీలో పాల్గొనే ఫైటర్లు ఎంతకైనా తెగించే వాళ్లు. నియమాలను పక్కన పెట్టి ప్రత్యర్థిని పడగొట్టేందుకు మోసం చేయడానికి కూడా వెనుకాడరు. ఈ పరిస్థితుల్లో తన పాత మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యమే సరిపోదని జోకు అర్థమవుతుంది.
ఓసారి గొడవలో తనను కాపాడిన లెజెండరీ గ్రాండ్‌మాస్టర్ వూను కలిసిన జో, అతని దగ్గర కఠినమైన శిక్షణ తీసుకోవడం మొదలుపెడతాడు. శరీరంతో పాటు మనసును కూడా సిద్ధం చేసుకుంటాడు. ఎందుకంటే ఈ పోరాటం అతని వ్యక్తిగత ప్రతీకారం కోసం కాదు.. తన కొడుకు ప్రాణాల కోసం. టోర్నమెంట్ మొదలైన తర్వాత ఒక్కో రౌండ్‌తో ప్రమాదం పెరుగుతుంది. ప్రత్యర్థుల దాడులు, టోర్నమెంట్ వెనుక ఉన్న అవినీతి, మోసాలు జోకు కొత్త సవాళ్లు విసురుతాయి. ఒకవైపు కొడుకును కాపాడుకోవాలనే తండ్రి బాధ్యత.. మరోవైపు రింగ్‌లో ఎదురయ్యే ప్రాణాంతకమైన ఫైట్లు. ఈ రెండింటి మధ్య జో ఎలా నిలబడ్డాడు? చివరికి 100,000 డాలర్ల ప్రైజ్ మనీని గెలిచి తన కొడుకుకు చికిత్స చేయించగలిగాడా? అన్నదే సినిమా అసలు ఉత్కంఠ.
‘లయన్ ఫిస్ట్’ సెప్టెంబర్ 15 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో నేరుగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)తో రెంట్ విధానంలో చూడొచ్చు. ప్రస్తుతానికి తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఇంగ్షీషు ఆడియోతో పాటు జర్మన్ వెర్షన్ ఉంది. 80ల నాటి ఓల్డ్-స్కూల్ మార్షల్ ఆర్ట్స్ సినిమాల తరహా ఫైటింగ్ యాక్షన్, తండ్రి-కొడుకు సెంటిమెంట్, ప్రతీకారం, అండర్‌గ్రౌండ్ టోర్నమెంట్ అంశాలను కలిపి ‘లయన్ ఫిస్ట్’ రూపొందించారు. కథలో కొత్తదనం కంటే యాక్షన్ ఎపిసోడ్లు, హీరో చేసే పోరాటంపైనే సినిమా ఎక్కువగా ఆధారపడుతుంది. ముఖ్యంగా కథ కంటే ఫైటింగ్ సీన్స్‌ను ఎంజాయ్ చేసే వారికి ఇది పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్.
Read Also: రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…