Harish Rao: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాత గత ప్రభుత్వంలో చేసిన ఒక్కో అవినీతి బయటపడుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయంలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను ప్రజలు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఈ ఫార్ములా రేస్ లో అవినీతి లాంటి విషయాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఈ కేసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు సంబంధించి భూకబ్జా ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హరీష్ రావుకు మాస్ లీడర్, ట్రబుల్ షూటర్ గా రాజకీయాల్లో పేరుంది. కానీ ఆయన భూదందాలు చేశారని ఆరోపణలు రావడం ఆసక్తికరంగా మారింది.
సిద్దిపేటలో హరీష్ రావు అనుచరులతో కలిసి భూకబ్జాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. కన్నుపడిన భూమిని కబ్జా చేయడం..తిరగబడితే అనుచరులు వెళ్లి బెదిరింపులకు పాల్పడేవారని ఆరోపణలు వస్తున్నాయి. మినిస్టర్ గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా హరీష్ రావు తన ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకునేవారని అక్కడివాళ్లు చెబుతున్నారు. అధికారంలో చేతిలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా తమ చేతిలోనే ఉండటంతో తిరగబడినవారిపై అక్రమ కేసులు పెట్టించేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా వినకుంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన అడ్వకేట్ ఒకరు హరీష్ రావు కబ్జాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టడం సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో హరీష్ రావు చేసిన దారుణాలను ప్రచారంలో చెప్పినందుకు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. హరీష్ అన్న ఫోన్ చేయమన్నారని.. లారీలతో గుద్ది చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. రంగనాయక్ సాగర్ తో పాటూ ఇతర ప్రాంతాల్లోనూ హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.
ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు హరీష్ రావు కబ్జా చేశారని ఆరోపించారు. కావాలంటే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని పూర్తి ఆధారాలను బయటపెడతానని అన్నారు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ పేరుతో తమ భూములు కబ్జా చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. హరీష్ రావు తన భూముల ధరలు పెంచుకోవడమే సుడా పార్క్, సుడా వనంలను నిర్మించాడని ఆరోపించారు. 402 సర్వే నంబర్ లో హరీష్ రావు ఇరిగేషన్ డిపార్మెంట్ భూమిని కబ్జా చేశారని తెలిపారు. మల్లన్న సాగర్ లో భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేశారని, రంగనాయక్ సాగర్ వద్ద భూములు కబ్జా చేసి మోసం చేశారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే వేములవాడ మీటింగ్ లోనూ సీఎం రేవంత్ రెడ్డి రంగనాయక్ సాగర్ భూముల వ్యవహారం గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. హరీష్ రావు బండారం బయటపెడతానని సీఎం హెచ్చరించారు. దీంతో ఆ మరుసటిరోజే హరీష్ రావు తాను ఒక గుంట భూమి కూడా ఎక్కడా కబ్జా చేయలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ భూములు తాను నిజాయితీగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసినట్టు చెప్పారు. అయితే కబ్జా ఆరోపణలపై విచారణ జరిగితే నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ ఆరోపణలు కనుక రుజువైతే ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ తప్పవు మరి.