
Mal Reddy Ranga Reddy | ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కేసీఆర్ దుర్మార్గ పాలన చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగా రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ తరుపున బరిలో ఉన్న మల్ రెడ్డి బిగ్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. .
“హైదరాబాద్‌కు ఆమడ దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వభూములు ఆక్రమించి కేసీఆర్ వేల కోట్ల సంపాదించాడు.. హెచ్‌ఎండీఏ ప్లాట్లు చేసి ప్రభుత్వ భూమి అమ్ముతున్నాడు. దానివల్ల ప్రజలకు జరిగే మేలు ఏంటి. ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పెద్దలు జేబులు నింపుకుంటున్నారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని దోచుకొని తింటున్నాడు. స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారి భూములు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున నేను గెలిస్తే ఇక్కడ అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతా,” అని అన్నారు.
ఇబ్రహీంపట్నం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. తప్పకుండా ప్రజలు నాకే ఓటేస్తామని అంటున్నారు.. తప్పకుండా 50 వేల మెజారిటీతో గెలుసానని మల్ రెడ్డి రంగా రెడ్డి ధీమా వ్యక్తి చేశారు. దళిత బంధు పథకం లబ్ది కేవలం ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే దక్కుతోందని.. అర్హులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ప్రగతి భవన్ వరకు మాత్రమే పరిమితమయ్యాయి అని ఎద్దేవా చేశారు. ఇబ్రహీంపట్నంలో పాఠశాలలు దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
కాంగ్రెస్ శ్రేణుల ఐక్యత, కమ్యూనిస్ట్‌ల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో నా గెలుపు తథ్యం అని మల్ రెడ్డి అన్నారు.