LPG Shortage: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం వ్యవహారంపై దేశంలోని అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ఎగుమతులు, దిగుమతుల మాట ఎలా ఉన్నా, ఎల్‌పీజీ కొరత కారణంగా తీవ్ర ఇక్కట్లు అప్పుడే మొదలయ్యాయి. దేశంలోని పలు నగరాల్లో ఈ సమస్య మొదలైంది. కొన్నిప్రాంతాలు లాక్ డౌన్ పరిస్థితిని తలపిస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా పలు చోట్ల హాస్టల్స్ మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల కఠిన ఆంక్షలు విధించాయి హాస్టల్స్ యాజమాన్యాలు.
పలు నగరాల్లో లాక్‌డౌన్ ప్రభావం.. ఆపై ఎల్‌పీజీ సమస్య
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరతపై కేంద్రం కొరడా ఝులిపించింది. ఇప్పటికే పలు కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కచ్చితంగా గృహ వినియోగదారులకు గ్యాస్ అందించాలని తేల్చి చెప్పేసింది. దీని ప్రభావం అప్పుడే వివిధ రంగాలపై పడింది. సోమవారం నుంచి కమర్షియల్ సిలిండర్ల పంపిణీని పూర్తిగా నిలిపివేశాయి వివిధ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్.
యుద్ధం తీవ్రమవుతుందన్న వార్తల నడుమ వాణిజ్య సిలిండర్లు లభించడం కష్టమనే అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో హాస్టల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ కష్టంగామారుతోంది. ఇదే పరిస్థితి ఒకటి లేదా రెండు రోజులు కంటిన్యూ మూసివేయాలనే నిర్ణయానికి వస్తున్నాయి. ఇప్పటికే హాస్టల్స్‌లో ఉండేవారిపై కఠిన ఆంక్షలు విధించాయి పలు ప్రాంతాల్లోని హాస్టల్స్ యాజమాన్యాలు.
మూతబడుతున్న హాస్టల్స్.. కొన్నిచోట్ల ఆంక్షలు
తొలుత మెనూలో కోత పెట్టారు. సహజంగా పేయింగ్ గెస్ట్ హాస్టళ్లలో ప్రతీ రోజు టిఫిన్ ఉండేది. ఇడ్లీ, దోశ, పూరీ, బోండా పెట్టేశారు. మధ్యాహ్నం లంచ్‌లో చపాతీ, అన్నం, పప్పు, కర్రీ ఉండేది. రాత్రి భోజనంలో కర్రీతోపాటు ఫ్రై పెడుతున్నాయి. గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం టిఫిన్, డిన్నర్ పలు పదార్థాలను తొలగించారు. ఈ మేరకు హాస్టల్స్‌లో ఉండేవారికి బుధవారం ఉదయం నుంచి సమాచారం ఇవ్వడం మొదలుపెట్టారు.
ఇక హైదరాబాద్ ఐటీ కారిడార్ గురించి చెప్పనక్కర్లేదు. సిటీలో దాదాపు 11 వేల హాస్టళ్లు ఉన్నాయి. మూడు వేలకు పైగా చిన్నస్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయన్నది ఓ అంచనా. ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ ఉద్యోగులు, వివిధ కోర్సులు నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులు సుమారు 10 లక్షల మంది హాస్టల్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: ట్యాక్స్ కలెక్షన్స్ పై యాక్షన్ షురూ.. నలుగురు బిల్ కలెక్టర్ల పై సస్పెన్షన్ వేటు
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మణికొండ, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వందలాది పీజీ హస్టళ్లు ఉన్నాయి. ఒక్క ఐటీ కారిడార్‌లో వేలాది హాస్టల్స్ కొనసాగుతున్నాయి. హాస్టల్స్ వద్ద నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే ఒక రోజు అయిపోయింది.
ఇలాగైతే హాస్టల్స్ నడపడం కష్టమని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని హోటల్స్ అసోసియేషన్ బలంగా కొరుతోంది. దీనికితోడు రంజాన్ మాసం కావడంతో హోటళ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. హలీం తయారీకి కట్టెలు ఉపయోగించడం వల్ల కొంత ఉపశమనం. కట్టెల పొయ్యిపై వంటలు చేసి సమయానికి అందించడం కష్టమని చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే లాక్ డౌన్ తప్పదనే అభిప్రాయానికి వస్తున్నాయి.