Hyderabad City: సామాన్యులకు అందుబాటులో ఉండేది హైదరాబాద్ సిటీ. యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలే కాదు, తక్కువ డబ్బులతో నివాసం ఉండటానికి ఆమోదయోగ్యమైన సిటీ కూడా. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల రాకతో రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతోంది. వాహన కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని అందించేందుకు పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని ఆలోచే చేసింది ప్రభుత్వం.
హైదరాబాద్ సిటీలో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ఏదో విధంగా చెక్ పెట్టాలని ఆలోచన చేస్తోంది రేవంత్ సర్కార్. అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర బస్సుల ప్రవేశాన్ని నియంత్రించాలని కొత్త ఆలోచన చేస్తోంది. నగరానికి రాకపోకలు సాగించే బస్సు ప్రయాణికుల కోసం లాస్ట్-మైల్ కనెక్టివిటీని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినళ్లు నిర్మించాలని భావిస్తోంది. అక్కడి నుంచి సిటీలోకి ప్రయాణికులు సులువుగా ప్రయాణించేందుకు వీలుగా ప్రజా రవాణా మార్గాల ద్వారా లాస్ట్-మైల్ కనెక్టివిటీని ప్రతిపాదించినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.
కొత్త ప్రణాళిక ప్రకారం.. గజలారామారం, శంషాబాద్, ఎల్‌బీ నగర్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినళ్లను అభివృద్ధి చేయనుంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే బస్సులు ఈ టెర్మినళ్ల వరకు నడుస్తాయి. టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు సిటీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడానికి తోడు రాత్రి వేళ పెద్ద సంఖ్యలో ఆయా వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ అమాంతంగా పెరుగుతోంది.
దీనివల్ల కాలుష్యం పెరుగుతోందన్నారు. అందుకు పరిష్కారంగా ప్రైవేట్ బస్సులను బస్సు టెర్మినల్స్ వద్ద ఉండే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు మనసులోని మాట వెల్లడించారు. కొత్త టెర్మినళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ యధావిధిగా పని చేస్తాయన్నారు. కొత్త టెర్మినళ్లు పూర్తయిన తర్వాత ప్రస్తుత బస్ స్టేషన్లకు సర్వీసుల పునఃప్రణాళికను పరిశీలిస్తామన్నారు.
ALSO READ: కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గాజులరామారంలో సుమారు 100 ఎకరాలు, శంషాబాద్ సమీపంలో 150 ఎకరాల భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సౌకర్యాలతో టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు మంత్రి. ప్రయాణికులకు వెయిటింగ్ కోసం సదుపాయాలు, పార్కింగ్, వంటి సౌకర్యాలను కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం చేసేందుకు రానున్న 2200 ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు మెరుగైన సిటీ బస్ కనెక్టివిటీ కలుగుతుందన్నారు.