రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతున్నట్టు తెలుస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను ప్రజలు సీఎంగా ఆశీర్వదించారు. రెండు సార్లు ఆయనకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు అవకాశం ఇవ్వగా.. రెండో పర్యాయంలో కేసీఆర్ పాలన ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది.నియంతృత్వ విధానాలు, నిరంకుశ పాలనతో పాటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుతో ఓట్లేసి గెలిపించిన ప్రజలు విసిగిపోయారు.అవినీతి, అక్రమాలు, కబ్జాలు, దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీని షెడ్డుకు పంపించారు. నాటి నుంచే ఆ పార్టీకి కౌండ్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మాజీ సీఎం కేసీఆర్ ఫౌంహౌస్‌కే పరిమితం అవ్వడం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను కేసులు వెంటాడుతున్నాయి.
ఉద్యమ పార్టీకి క్రమంగా ప్రజల మద్దతు తగిపోతుండగా బీజేపీకి మాత్రం తెలంగాణలో క్రమంగా ఓటింగ్ పర్సంటేజీ పెరుగుతూ వస్తున్నది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు 8 ఎంపీలు, 8 శానససభ స్థానాలను కట్టబెట్టారు. ఉత్తర తెలంగాణ బీజేపీ క్రమంగా తన ఉనికిని పెంచుకుంటూ వెళ్తున్నది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ బీజేపీకి మంచి పట్టుఉన్నది. ఎందుకంటే గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ..రెండో స్థానంలో నిలిచింది. నాడు తొలిస్థానంలో బీఆర్ఎస్.. మూడోస్థానంలో కాంగ్రెస్ నిలిచిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బలమైన పట్టు ఉండగా.. ప్రస్తుతం పల్లెల్లోనూ క్రమంగా పార్టీ బలాన్ని పుంజుకుంటోంది. అయితే, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ నేతలను వరుసగా కేసులు వెంటాడుతుండగా.. బీజేపీ నెమ్మదిగా తన పనిని తాను చేసుకుని వెళ్తున్నది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ క్రమంగా ఓటింగ్ షేర్ పెంచుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ కూడా గెలుచుకోలేదు. కానీ బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్‌ను తన ఖాతాలో వేసుకున్నది.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో దాదాపు గెలిచినంత పనిచేసింది. సింగిల్ లార్జెస్ట్ డివిజన్లను కైవసం చేసుకుంది. చివరకు మెజార్టీ స్థానాలు రాకపోవడంతో అక్కడ ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. అలాగే మున్సిపాలిటీల్లోనూ ఈసారి సత్తా చాటింది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న బీజేపీ రెండో స్థానంలోకి వచ్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తున్నట్టు తెలుస్తున్నది. అదే జరిగతే ఇక ఇంతకాలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉన్న పొలిటికల్ ఫైట్ కాస్త.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారనుంది. దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోరు నడుస్తూనే ఉన్నది. కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్.. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్‌తో తలపడుతోంది. అందుకే కారు పార్టీని పక్కకు తప్పించి.. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో రాజకీయం చేయాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సైతం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.