
Palakurthi : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి పోటీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. యశస్విని రెడ్డి నామినేషన్ రిజెక్ట్ అవుతుందంటూ ఎర్రబెల్లి వర్గం బాగా ప్రచారం చేసింది. నామినేషన్ల పరిశీలన సమయంలోనూ ఆర్వోతో బీఆర్ఎస్ నాయకులు తీవ్ర వాగ్వాదం చేశారు. యశస్వినిరెడ్డి సమర్పించిన డాక్యుమెంట్లపై అభ్యంతరం తెలిపారు.
యశస్వినిరెడ్డి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం సరిగ్గానే ఉన్నాయని రిటర్నింగ్ అధికారి తేల్చి చెప్పారు. ఆర్వో నిర్ణయంతో ఎర్రబెల్లి వర్గం షాక్ కు గురైంది. యశస్వినిరెడ్డిని పోటీలో లేకుండా చేయడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆమె నామినేషన్ ఆమోదం పొందడంతో ఎర్రబెల్లి ఆశలు గల్లంతు అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎదురుగాలి వీస్తుందనే ప్రచారం సాగుతోంది. ఇక్కడ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ బలం మరింత పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ సభకు జనం భారీగా పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు, యూత్ భారీగా తరలివచ్చారు. ఎర్రబెల్లిని ఓడించి తీరుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభావేదికపై స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి స్పీచ్ కూడా జనాన్ని విపరీతంగా ఆకర్షించింది.
మరోవైపు ఎర్రబెల్లి ప్రధాన అనుచరులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఆయన రైట్ హ్యాండ్ గా ఉన్న కీలక నేత కక్కిరాల కూడా ఎర్రబెల్లికి దూరమయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓడిపోతారనే చర్చ జోరుగా సాగుతోంది.