
Seethakka : ములుగు ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత సీతక్క సోమవారం బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ” నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్ రూ.200 కోట్లు ఖర్చు చేస్తోంది. ములుగులో దొంగ నోట్లు కూడా పంచుతున్నారు. ఇక గ్రామాల్లో అయితే మద్యం ఏరులై పారుతోంది. ఇంకొకరైతే ‘సీతక్క మంత్రి అవుతుందట!’ అంటూ హేళనగా మాట్లాడారు. ఏ బడుగు బలహీనవర్గాల వారు మంత్రలు కాకూడదా? ఇంకా దొరల తెలంగాణ కావాలా? మనమంతా దొరల చేతిలో బందీలుగా బతుకుదామా?.. మనకు ఇల్లు, పోడు భూములకు పట్టాలు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు ప్రచారానికి ఇండ్ల కాడికి వస్తే వారిని తరిమి కొట్టండి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అలాగే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. “అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడు.. ‘సీతక్క మంత్రి అవుతుందట!’ అని ఎద్దేవా చేస్తున్నాడు. ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా” అని నిలదీశారు. బడుగుబలహీన వర్గాలంటే బీఆర్ఎస్ నేతలకు చులకన అని సీతక్క ఆరోపణలు చేశారు.
ములుగులో తనకు ప్రత్యర్థి నాగజ్యోతి కాదని.. ఇక్కడ నుంచి నేరుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోటీచేస్తున్నారని సీతక్క విమర్శలు చేశారు. తనను ఓడించడానికి నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.
మండలంలోని కన్నాయిగూడెంలో సీతక్క ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు కష్టపడుతున్న తనపై కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు. కరోనా కాలంలో ప్రజాసేవ చేసినందుకా? ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్నందుకా?. ఎందుకు? అని నిలదీశారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే.. తప్పకుండా మంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుస్తే.. డబ్బులు గెలిచినట్టు.. అదే తాను గెలిస్తే ములుగు ప్రజలు గెలిచినట్టే అని సీతక్క వ్యాఖ్యానించారు.
BJP News: బండి డైలాగ్ బాంబ్.. బీజేపీలో బిగ్ బ్యాంగ్..