CM Progress Report: కబ్జా కోరల్లో చిక్కుకున్న వేల కోట్ల విలువైన దేవాదాయ భూములను రక్షించేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఇందుకోసం.. చట్ట సవరణ చేయబోతోంది. ఇక.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా.. కెనడా హైకమిషనర్ బృందాన్ని కోరారు సీఎం. ఇక.. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలతో పాటు వివిధ శాఖల్లోని 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను.. కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది. వరంగల్‌లో వరద బాధితులను కలిసి.. ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
అక్టోబర్ 28, మంగళవారం ( అభివృద్ధి పనులకు నిధుల విడుదల )
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యవసర పనుల కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు.. ప్రభుత్వం 239 కోట్లకు పైనే నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేంద్రం నిధులు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మిగతా మొత్తాన్ని అందిస్తోంది. ఈ నిధులతో సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యాలతో పాటు డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో.. రోడ్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.
అక్టోబర్ 28, మంగళవారం ( బ్యారేజీల మరమ్మత్తులపై రివ్యూ )
రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి.. రిపోర్టులు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యూషన్‌కు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇటీవల రాసిన లేఖపై.. సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపై, ప్రాజెక్టుల వారీగా స్టేటస్ రిపోర్టులు తయారు చేయాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైనా సీఎం రివ్యూ చేశారు. బ్యారేజీల మరమ్మత్తులకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు చెప్పారు. ప్రాజెక్టుల వారీగా రూపొందించే పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై.. నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. తుమ్మిడిహట్టి దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టుపైనా సమీక్షలో చర్చించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా.. ప్రాజెక్టుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం కావాలని చెప్పారు. సుందిళ్లను మరమ్మత్తు చేసి వినియోగంలోకి తీసుకొచ్చి.. శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
అక్టోబర్ 28, మంగళవారం ( శంకరమఠంలో ప్రత్యేక పూజలు )
హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో.. గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకరమఠంలో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా.. హైదరాబాద్‌కు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారికి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను తెలియజేశారు.
అక్టోబర్ 29, బుధవారం ( కార్పొరేట్‌కు దీటుగా.. )
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి.. సర్కార్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్‌గా తీసుకొని.. అక్కడి పాఠశాలల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి, అవసరమైన వసతులు కల్పించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలుత ప్రయోగాత్మకంగా చేపట్టి.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. దీని సంబంధించిన ఉత్తర్వులను సీఎం రేవంత్ రెడ్డి జారీ చేశారు. పాఠశాలల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా.. బడుల్లో సకల సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 13 అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్త్తోంది. వాటి ఆధారంగా పాఠశాలల్లో మరమ్మతులు సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. ల్యాబ్ ఫర్నీచర్, సైన్స్ ల్యాబ్‌లతో పాటు లైబ్రరీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలలో కనీసం రెండు క్రీడా మైదానాలు ఉండేలా చూస్తారు. పాఠశాలల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఒకేషనల్ ఎడ్యుకేషన్‌తో పాటు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ మెటీరియల్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా.. పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయనున్నారు. ఇప్పటికే.. సీఎం సొంత నియోజకవర్గం.. కొడంగల్‌లో సర్కారు పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన సర్వే పూర్తయింది.
అక్టోబర్ 29, బుధవారం ( రైతుకు ఇబ్బంది కలగొద్దు )
రాష్ట్రంలో మొంథా తుపాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ జరిపారు. వరి కోతల సమయం కావడంతో.. చాలా చోట్ల చోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతులకు ఎలాంటి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉందని.. అందుకు తగినట్లుగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక.. తుపాన్ ప్రభావంతో వర్షపు నీరు నిలువ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించే అవకాశం ఉన్నందున.. నగర, పురపాలక, గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్యారోగ్య శాఖ కూడా తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు.
అక్టోబర్ 30, గురువారం ( కొనుగోలు కేంద్రాలపై ఫోకస్ )
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొంథా తుపాను వల్ల తలెత్తిన పరిస్థితులతో.. ప్రతి కొనుగోలు కేంద్రానికి.. మండల స్థాయి అధికారిని.. ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర తీసుకోవలసిన చర్యలపై సీఎం సూచనలిచ్చారు. అధికారుల సెలవులను రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై రోజువారీగా కలెక్టర్లకు నివేదికలు అందించాలని చెప్పారు. నివేదికలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.
అక్టోబర్ 31, శుక్రవారం ( వరద బాధితులకు సీఎం భరోసా )
భారీ వర్షాలు, వరదల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల మీదుగా సీఎం ఏరియల్ సర్వే చేశారు. తర్వాత.. హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో.. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. హన్మకొండలోని సమ్మయ్యనగర్, కాపువాడ, పోతననగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తూ బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం సహాయం అందిస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసానిచ్చారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, నాలాలను పరిశీలించి, మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని పరిశీలించారు. రివ్యూ సమావేశం నిర్వహించి.. బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
మొంథా తుపాను ప్రభావంతో.. వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు సీఎం. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. ఇక.. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండ్లు నష్టపోయిన వారికి 15 వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. అత్యంత నిరుపేదలు ఉంటే.. అర్హత మేరకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాల్నారు. నాలాలను కబ్జా చేసి అడ్డంకులు సృష్టించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్నారు. పది మంది కబ్జాలకు పాల్పడితే పది వేల మందికి నష్టం జరుగుతోంద్నారు సీఎం. వరంగల్‌లో కొన్ని చోట్ల స్మార్ట్ సిటీ పనులను వదిలేశారని.. మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు రిపోర్ట్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అక్టోబర్ 31, శుక్రవారం ( అజారుద్దీన్‌కు అభినందనలు )
క్యాబినెట్ విస్తరణలో భాగంగా రాజ్‌భవన్‍లో మహ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
అక్టోబర్ 31, శుక్రవారం ( ఉద్యోగులకు శుభవార్త )
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన 1031 కోట్ల పెండింగ్ బిల్లుల్ని విడుదల చేశారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను.. రేవంత్ సర్కార్ దశలవారీగా క్లియర్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి.. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 712 కోట్లను రిలీజ్ చేశారు. అదేవిధంగా.. 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయాలన్న నిర్ణయంలో భాగంగా.. పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ శాఖకు సంబంధించి 46 వేల 956 బిల్లుల తాలూకూ 320 కోట్లను రిలీజ్ చేశారు. అలాగే.. రోడ్లు భవనాల శాఖకు చెందిన 10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం 95 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం 225 కోట్లను కూడా రేవంత్ ప్రభుత్వం విడుదల చేసింది.
నవంబర్ 1, శనివారం ( దేవాదాయ భూముల రక్షణ )
తెలంగాణలో దేవాదాయ భూముల రక్షణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్, 1987 చాప్టర్ XI సవరణకు కసరత్తు చేస్తోంది. సెక్షన్ 83, 84 తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ బిల్లు ప్రవేశపెట్టనుంది. ట్రిబ్యునల్, కోర్టు కేసులతో దర్జాగా వేల ఎకరాలు కబ్జా చేస్తున్న వాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన వందల ఎకరాలను పరిరక్షించాలని ప్రభుత్వం చూస్తోంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న వేల కోట్ల విలువైన దేవాదాయ భూములు రక్షించేందుకు నడుం బిగించింది. దేవాలయ, చారిటబుల్ సంస్థలకు చెందిన భూముల్లో.. ఎలాంటి నిర్మాణాలున్నా.. వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఎండోమెంట్ అధికారులు, అవసరమైతే పోలీసు, హైడ్రా సాయంతో ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
నవంబర్ 1, శనివారం ( పెట్టుబడులు పెట్టండి )
హైకమిషనర్ ఆఫ్ కెనడా బృందం సీఎం రేవంత్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో.. కెనడా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను.. క్రిస్టోఫర్ కూటర్ బృందానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా.. ఫ్రాన్స్ కాన్సుల్ టీమ్ కూడా.. ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయింది. హైదరాబాద్‌లో ఆన్ గోయింగ్ ఫ్రాన్స్ ప్రాజెక్టులపై చర్చించారు. నగరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని.. ఫ్రాన్స్ బృందాన్ని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని..
మరింత బలోపేతం చేయాలన్నారు.
Story By Anup, Bigtv