Jubilee Hills Bypoll: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. ఎన్నిక దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయ విమర్శలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇప్పుడు కవిత ఎపిసోడ్ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ అయ్యింది.
జూబ్లీహిల్స్ బైపోల్.. వేడెక్కిన ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కేవలం వారం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ తిరుగే స్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం కీలక నేతలు, మంత్రులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌లు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నిక తర్వాత అధికార కాంగ్రెస్-విపక్షబీఆర్ఎస్ ప్రత్యక్ష్యంగా తలపడుతున్న ఎన్నిక కావడం ఇదే కావడంతో నేతలు ఆరోపణలు కోటలు దాటుతున్నాయి. ఎర్రగడ్డ డివిజన్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. సొంత చెల్లి కేటీఆర్‌పై ఆరోపణలు చేసిందని, ఏ ఆడబిడ్డ సొంత ఇంటిపై ఆరోపణలు చేయదన్నారు.
కేసీఆర్-కేటీఆర్‌లకు సీఎం రేవంత్ సూటి ప్రశ్న
మీ చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం. సొంత చెల్లిని పట్టించుకోనివారు, చిన్నమ్మ బిడ్డలను కొనిస్తారా? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. కేవలం ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందని ఒక్కకారణంతో కేటీఆర్ తన చెల్లిని పక్కనపెట్టారని ఆరోపించారు. సొంత చెల్లినే చూసుకోనోడు సునీతమ్మ మంచి కోరుకుంటాడా? దీనిపై ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు.
కంటోన్మెంట్ ఉపఎన్నికలో శ్రీ గణేష్‌ను గెలిపించగానే ఆ నియోజకవర్గాన్ని 4 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ALSO READ: సీఎం చొరవ.. పెండింగ్ ఫైల్స్ క్లియర్
సానుభూతితో ఓట్లు దండుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు. సంప్రదాయాలను తుంగలో తొక్కింది ముమ్మాటికీ కేసీఆర్ అని విమర్శించారు. సెంటిమెంట్ పేరుతో కారు పార్టీ నేతలు మీ ముందుకు వస్తున్నారని, ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలన్నారు.
2007లో పీజేఆర్ ఆకస్మికంగా చనిపోతే ఏకగ్రీవంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరితే అందుకు టీడీపీ ఓకే చెప్పిందని, అభ్యర్థిని నిలబెట్టి కేసీఆర్ ఎన్నిక తెచ్చిన విషయం గుర్తు లేదా? అంటూ మండిపడ్డారు. ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని మూడు గంటలు బయట నిలబెట్టి అవమానించలేదా? పీజేఆర్ కుటుంబంపై పోటీ పెట్టి సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది ముమ్మాటికీ కేసీఆర్ అని కుండబద్దలు కొట్టేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కౌంటర్లు పడలేదు. తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను ఆ పార్టీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గుండాగాళ్ళు ఎవరైనా బెదిరిస్తే పక్కనే బీఆర్ఎస్ భవన్ ఉందని, ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, 40 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకొని వస్తామన్నారు. ఎవరేం చేస్తాడో చూస్తామని అన్నారు. రహ్మత్ నగర్ డివిజన్‌లో శనివారం రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తరపున ప్రచారం నిర్వహించారు కేటీఆర్.
సొంత చెల్లెలికి అన్నం పెట్టనోడు.. చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తా అంటే ఎవడైనా నమ్ముతాడా..?
: సీఎం రేవంత్ రెడ్డిసొంత చెల్లినే చూసుకోనోడు సునీతమ్మ మంచి కోరుకుంటాడా..?
అబద్ధాలతో కేటీఆర్ వస్తున్నాడు
పేదలకు రేషన్ కార్డు, ఉచిత కరెంట్, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం,… pic.twitter.com/WIAXXXaFvA
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2025