Big Stories

Telangana Polling : తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌

Telangana Polling : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 18 నుంచి 39 ఏళ్లలోపు వాళ్లు 1 కోటి 60 లక్షల మందికి పైగా ఉన్నారు. 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705మంది మహిళా ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్ల కంటే 3,287 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కొత్తగా.. 9,99,667 మంది తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7 లక్షలకు పైగా ఓటర్లుంటే.. భద్రాచలంలో అత్యల్పంగా 1.48లక్షల మంది ఓటర్లున్నారు.

- Advertisement -

ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవ్వగా.. 13 సమస్యాత్మకమైన ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మకమైన 13 ప్రాంతాల్లో 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే ఈసీ సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

కాగా.. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి..2,290 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా వారిలో 221 మహిళలు ఉన్నారు. అత్యధికంగా ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో 48 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో 44 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 119 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, 118 స్థానాల్లో కాంగ్రెస్‌, 111 స్థానాల్లో బీజేపీ, 8స్థానాల్లో జనసేన,19స్థానాల్లో సీపీఎం, 108 స్థానాల్లో బీఎస్పీ, 9స్థానాల్లో ఎంఐఎం, ఒక స్థానంలో సీపీఐ పోటీ చేస్తున్నాయి. చింతమడకలో సీఎం కేసీఆర్, నందినగర్ లో మంత్రి కేటీఆర్, కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క, నల్గొండలో కోమటిరెడ్డి ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News