దోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీంతో ఎలాంటి వంటకాలు చేయాలో చాలామందికి తెలియదు. అందుకే పప్పులోను, సాంబార్లోను వేస్తారు. నిజానికి దోసకాయను కాల్చి రోట్లో దంచుకొని పచ్చడి చేస్తే అదిరిపోతుంది. స్పైసీగా ఉండే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆహా అనిపించేలా ఉంటుంది. దీన్ని ఇడ్లీతో, దోశతో తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం దోసకాయ కాల్చి చేసే రోటి పచ్చడి ఎలాగో తెలుసుకోండి.
దోసకాయ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
దోసకాయ – ఒకటి
మినప్పప్పు – రెండు స్పూన్లు
ఆవాలు – రెండు స్పూన్లు
జీలకర్ర – రెండు స్పూన్లు
పసుపు – పావు స్పూను
పచ్చిమిర్చి – నాలుగు
కొత్తిమీర – ఒక కట్ట
పచ్చిశనగపప్పు – రెండు స్పూన్లు
ధనియాలు – రెండు స్పూన్లు
అల్లం – చిన్న ముక్క
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
చింతపండు – ఉసిరికాయ సైజులో
ఎండుమిర్చి – నాలుగు
ఇంగువ – చిటికెడు
కరివేపాకులు – గుప్పెడు
దోసకాయ రోటి పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
2. తర్వాత ఎండుమిర్చిని వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని రోట్లో వేసుకోవాలి.
3. ఆ రోట్లోనే కొంచెం చింతపండును, పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద దోసకాయను కాల్చి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
5. రోట్లో దోసకాయ ముక్కలను కూడా నలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పును వేసి బాగా దంచుకోవాలి.
6. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
7. ఇప్పుడు దీనికి తాళింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
8. ఆ తాళింపును పచ్చిలో వేసి కలిపేయాలి. అంతే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయినట్టే. ఇది అద్భుతంగా ఉంటుంది.
దోసకాయలలో 95 శాతం నీరే ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. తక్కువ క్యాలరీలు ఉండే దోసకాయను తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ కూడా సవ్యంగా జరుగుతుంది. మధుమేహులు ఆహారంలో దీన్ని భాగం చేసుకోవాలి. వీటికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి ఉంటుంది. దోసకాయ చర్మానికి కూడా పోషకాలను అందిస్తుంది. నోటి ఆరోగ్యానికి కూడా దోసకాయ ఎంతో ముఖ్యం.