Rahul Gandhi Bodhan Meeting : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణను చుట్టేస్తున్నారు. బోధన్ లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వేల ఎకరాల భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు.
లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ద్వారా సంపాదించిన డబ్బుతో కేసీఆర్ గ్యాంగ్ ఎన్నికల్లో పోటీ చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దళిత బంధు పేరుతో కమీషన్లు గుంజుకున్నారని విమర్శించారు. ధరణి రూపంలో కేసీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే ఉన్న భూమి కూడా గుంజుకుంటారని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కేసీఆర్ చదువుకున్న స్కూల్ కూడా కాంగ్రెస్ కట్టిందేనని తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ విజయం తథ్యమని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ఆదిలాబాద్ సభలో ప్రసంగిస్తూ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తాము అధికారంలోకి రాగానే ప్రజలకు పంచుతాం అని తెలిపారు.