ED Inquiry into Bhudan Land: రంగారెడ్డి జిల్లా భూదాన్ భూమి అన్యాక్రాంతం వ్యవహారంపై తీగలాగితే డొంక కదులుతోంది. ఇందులో ప్రమేయమున్న అధికారులు ఒకొక్కరుగా ఈడీ విచారణ ముందుకు వస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ జాబితాలోకి ఆర్డీఓ వెంకటాచారి చేరిపోయారు.
రంగారెడ్డి జిల్లా నాగారంలో 42 ఎకరాల భూధాన్ భూముల అన్యాక్రాంతంపై లోతుగా విచారణ చేపట్టింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. తొలుత ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ నుంచి ఈ డొంక కదిలింది. విచారణలో సేకరించిన ఆధారాలతో ఒకొక్కర్ని విచారణకు పిలుస్తున్నారు ఈడీ అధికారులు.
రెండురోజుల కిందట ఎమ్మార్వో జ్యోతి నుంచి కీలక వివరాలు సేకరించారు అధికారులు. అప్పటి కలెక్టర్ అమోయ్.. ఎమ్మార్వో జ్యోతి ఇచ్చిన సమాచారంతో గురువారం ఆర్డీఓ వెంకటాచారి ఈడీ ముందుకు వచ్చారు.
భూధాన్ బోర్డుకు చెందిన 42 ఎకరాల భూమిని ఖాదరున్నీ షా అనే మహిళకు తొలుత రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. దీని వెనుక తొలుత అప్పటి కలెక్టర్ అమోయ్, తహశీల్దార్ జ్యోతి, ఇప్పుడు ఆర్డీఓ వెంకటాచలం పేర్లు వెలుగులోకి రావడం ఈడీ ముందు హాజరుకావడం చకచకా జరిగింది.
ALSO READ: కిచెన్‌లో బొద్దింకలు.. ఫ్రిజ్‌లో కుళ్లిన చికెన్, మటన్.. హైదరాబాద్ రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు
ఆ భూములను వేరే మహిళకు కట్టబెట్టిన క్రమంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంతర్గత సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్లతో అధికారులకు కోట్ల రూపాయలు అందినట్టు ఈడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూపీ లాగుతోంది.
రంగారెడ్డి జిల్లా నాగారంలోని 102 ఎకరాలపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అందులో దాదాపు 50 ఎకరాలు భూదాన్ బోర్డుకు చెందినదని వాదిస్తున్నారు నిర్వాహకులు. ఆ భూమి జబ్బార్దస్తఖాన్ అనే వ్యక్తి మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. తర్వాత కాలంలో ఆయన కొడుకు హజీఖాన్ భూదాన్ బోర్డుకు కొంత భూమిని దానం చేశారు.
మూడేళ్ల కిందట హజీఖాన్ వారసురాలిని తానంటూ ఖాదురున్నీషా అనే మహిళ దరఖాస్తు చేసుకుంది. మహిళ దరఖాస్తు చేసిన కొద్దిరోజులకే ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. దిగువ స్థాయిలో ఎమ్మార్వో, ఆర్డీఓ, ఆర్ఐలు ఆమెకి అనుకూలంగా పని చేశారని విచారణలో తేలింది.
ప్రస్తుతం ఆయా భూములపై మరింత లోతుగా విచారణ మొదలుపెట్టింది ఈడీ. దీంతో అధికారులు ఒకరి తర్వాత మరొకరు ఈడీ ముందుకు వస్తున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా? లేదా అనేది త్వరలో వెల్లడికానుంది.