Bathukamma Kunta: హైదరాబాద్ లో కుంటల పూర్వ వైభవానికి కట్టుబడి ఉన్నామని హైడ్రా స్పష్టం చేస్తూ వస్తుంది. ఆక్రమణలకు గురైన కుంటలను రక్షించి వాటికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా అంబర్ పేట్ బతుకమ్మ కుంటను ఆక్రమణల నుంచి రక్షించి.. రూ.7.4 కోట్లతో అభివృద్ధి చేసింది. పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు చెత్తా చెదారం నిండిపోయిన బతుకమ్మ కుంట నేడు విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. బతుకమ్మ కుంట చుట్టూ పచ్చని చెట్లు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం ఏర్పాటు చేశారు.
అంబర్‌పేట్‌లో ఉన్న ఈ చెరువు కొన్నేళ్ల పాటు ఆక్రమణలు, న్యాయపరమైన సమస్యలతో వివాదాల్లో చిక్కుకుంది. పట్టించుకునే వారు లేక ఓ మురికి కుంటగా మారింది. ఈ చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా చేపట్టింది. ఒకప్పుడు చెత్త కుప్పలాగా ఉన్న బతుకమ్మ కుంటను ఎంతో సుందరంగా మార్చింది. సెప్టెంబర్ 25న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
హైడ్రా రంగంలోకి దిగక ముందు బతుకమ్మ కుంట పూర్తిగా పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో కంపుకొట్టేది. ఈ క్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని హైడ్రాను కోరారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కుంట సుందరీకరణ పనులు చేపట్టింది. దాదాపు రూ.7.40 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టింది. ప్రస్తుతం 5 ఎకరాల 12 గుంటల్లో ఉన్న బతుకమ్మ కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఉత్సవాలను అంబర్ పేట్ చెరువు వద్ద నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా హైడ్రా ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల కోసం బతుకమ్మ కుంటను సుందరంగా రెడీ చేశారు. హైడ్రా రాక ముందు, హైడ్రా వచ్చాక అంటూ బతుకమ్మ కుంట వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే బతుకమ్మ కుంట స్థలం తనదేనంటూ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే రెవెన్యూ, హైడ్రా, నీటి పారుదల శాఖల అధికారులు సర్వే నంబర్ 563లోని భూ రికార్డులను పరిశీలించి హైకోర్టులు కౌంటర్ దాఖలు చేశారు. దాదాపు నెల రోజుల పాటు విచారణ జరగగా.. చివరకు ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి భూమిపై ఎలాంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. బతుకమ్మ కుంటను చెరువుగానే గుర్తించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Also Read: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..
1962-63 నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం బతుకమ్మ కుంట విస్తీర్ణం సుమారు 14 ఎకరాలు కాగా.. కాలక్రమేణా కబ్జాల వల్ల చెరువు విస్తీర్ణం తగ్గిపోయింది. ప్రస్తుతం 5.15 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే కుంట భూమి ఉంది. తాజాగా హైడ్రా చొరవతో చెరువు పాత రూపాన్ని పొందింది.
ఈ కుంట భూమి తనదే అంటూ స్థానిక బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ డాక్యుమెంట్లలో ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 1970 సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో ఈ ప్రాంతం చెరువుగానే ఉందని రంగనాథ్ తెలిపారు.