వారంతా వివిధ కారణాలతో ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయారు. మొత్తం 472 మంది వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇబ్బందులను వారు సీఎం ప్రజావాణిలో విన్నవించుకున్నారు. తమ కుటుంబాలను ఆదుకోవాలని, తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. ఆ విన్నపాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆయా కుటుంబాలకు భరోసా నిచ్చారు. ఆయన చొరవతో నేడు 136మందిని తెలంగాణ ఆర్టీసీ తిరిగి విధుల్లోకి తీసుకుంది. వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది.
తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఇది ఓ అపురూప ఘట్టంగా మిగిలిపోతుందని అంటున్నారు. తమకు ఉద్యోగాలు తిరిగి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య లకు వారంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇందులో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లు, సెక్యూరిటీ గార్డ్ లు ఉన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా వాణి కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రజావాణి కీలకంగా పనిచేస్తోంది. కేవలం అర్జీలు స్వీకరించడమే కాదు, వాటి పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ప్రజావాణికి హాజరయ్యారు. ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన 472 మంది అర్జీలు ఇచ్చారు. తమ తప్పులు క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యకు వారు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీలో తొలగింపబడిన ఉద్యోగుల విషయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వచ్చింది. ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో చివరకు పరిష్కారం దొరికింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా సెర్ప్ సీఈఓ, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య సభ్యురాలిగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మెంబర్ కన్వీనర్ గా ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తుది నివేదిక ప్రకారం తొలి విడతలో 136మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 336 మంది ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వినేందుకు బ్యాచ్ వారీగా తేదీలను కూడా ఖారారు చేసి షెడ్యూల్ ప్రకటించారు అధికారులు.