Revanth Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కేసీఆర్ హరించారని మండిపడ్డారు. ప్రజల హక్కులను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందన్నారు. 10 మంది కేసీఆర్ లు మరణించినా తెలంగాణ వచ్చేది కాదని.. సోనియా గాంధీ వల్లే రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని స్పష్టం చేశారు.
మేడిగడ్డపై కనీసం అవగాహన లేకుండా మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పెద్ద విషయం కాదన్నట్టు మాట్లాడటం దారుణమన్నారు. బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో బ్యారేజ్ నిర్మించారని తెలిపారు. కేసీఆర్ కుటుంబమే సాగునీటి రంగ నిపుణులు అన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సంక్షేమ పథకాలను కాంగ్రెస్సే మొదలుపెట్టిందని రేవంత్ అన్నారు. ఉచిత విద్యుత్ నుంచి పెన్షన్ల వరకు అన్ని పథకాలను ప్రారంభించిందన్నారు. కేసీఆర్ ఏం చేశారో చెప్పుకునే పరిస్థితుల్లో లేరన్నారు. అందుకే కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలనే కేసీఆర్ కాపీ కొట్టారని ఆరోపించారు. రైతులకు 10 వేలు సాయం చేస్తామని 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనపై చర్చ రెడీ అని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఏం చేయగలుగుతుందో కూడా చెబుతామని స్పష్టం చేశారు. ఓటుకు విలువకట్టిన నేత కేసీఆర్ అన్నారు.
క్రమపద్దతి లేకుండా హైదరాబాద్ లో నిర్మాణాలకు కేసీఆర్ అనుమతిచ్చారని రేవంత్ ఆరోపించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లు నిర్మించే ప్రణాళిక తమ వద్ద ఉందన్నారు. తెలంగాణను మెగా మాస్టర్ ప్లాన్ తో డెవలప్ మెంట్ చేస్తామన్నారు. అసైన్ మెంట్ భూములకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే కబ్జాదారులు ఆరోపించారు. ధరణి పోర్టల్ తో రైతులకు అన్నిదారులు మూసివేశారని రేవంత్ ఫైర్ అయ్యారు. ధరణిలో సమస్యలు ఉంటే చెప్పుకునే పరిస్థతి లేదన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలో సంపూర్ణ మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
కేటీఆర్ పైనా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో చిరు ఉద్యోగానికి కూడా కేటీఆర్ అర్హుడు కాదన్నారు. తాను కందిపప్పు అయితే కేటీఆర్ గన్నేరు పప్పు అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబానికే పదవులు వచ్చాయని రేవంత్ మండిపడ్డారు.