CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన “రైతు ఆశీర్వాద సభ”లో ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా పోరాటాల గడ్డ అని కొనియాడుతూ, రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ శ్రేణులు విశ్రమించవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన, ప్రతిపక్షాల అంతర్గత కలహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం నా గుండెకాయ.. ఉప్పెనలా ప్రజా తీర్పు!
రాజకీయంగా తనకు పాలమూరు ప్రాణమైతే, ఖమ్మం జిల్లా తన గుండెకాయ లాంటిదని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రకటించారు. 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, నాడు ఖమ్మం ప్రజలు ఉప్పెనలా తరలివచ్చి బీఆర్ఎస్ అహంకారాన్ని బొంద పెట్టారని అన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గెలిపిస్తూ, తెలంగాణను దోచుకున్న ‘పాపాల భైరవుణ్ణి’ ఫామ్ హౌస్‌కే పరిమితం చేసిన ఘనత ఖమ్మం ప్రజలదేనని, ఈ చింతకాని సభకు వచ్చిన వేలాది మంది జనమే అందుకు సాక్ష్యమని కొనియాడారు.
2029 ముందస్తు జోస్యం.. కాంగ్రెస్ సరికొత్త రికార్డు!
తదుపరి సాధారణ ఎన్నికలపై ముందస్తుగానే జ్యోస్యం చెప్పిన సీఎం, రాబోయే ఎన్నికలు 2028 డిసెంబర్‌లో కాకుండా, 2029 మే లేదా జూన్ మాసంలో జరుగుతాయని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు 17 నుండి 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుండి 182కు పెరుగుతాయని వెల్లడించారు. 36 నెలల ముందే తాను ఫలితాలను ప్రకటిస్తున్నానని, భద్రాచలం రాముడిపై ఆనగా చెబుతున్నా.. రాబోయే 182 సీట్లలో 117 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ మళ్లీ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నమ్ముకున్న దొంగ సర్వేల ఏజెన్సీలు ఈ విషయాన్ని రాసి పెట్టుకోవాలని సవాల్ విసిరారు.
మేడిగడ్డ రాజకీయం.. ఖమ్మం ముంపుపై ఆగ్రహం!
కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, ఒకే ఇంట్లో రెండు గుంపులుగా తయారయ్యారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకరు కన్నెపల్లికి వెళ్లి పంపులు ఆన్ చేయాలని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఒక్కసారి మేడిగడ్డ కుంగితేనే తెలంగాణకు ఇంత నష్టం జరిగిందని, మళ్లీ అక్కడ నీళ్లు నింపితే భద్రాచలం రామాలయంతో పాటు ఖమ్మం జిల్లాలోని 44 గ్రామాలు మునిగిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆ ఊర్లు కొట్టుకుపోయినప్పుడు రాని జాలి, ఇప్పుడు కేసీఆర్ దుష్ట రాజకీయాల కోసం మళ్లీ మేడిగడ్డను నింపాలా? అని నిలదీశారు.
దొంగ సర్వేలు.. సొంత చెల్లెలి లీకులు!
ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండానే కాంగ్రెస్ ఓడిపోతుందంటూ బీఆర్ఎస్ ‘బ్యాండ్ మేళం బ్యాచ్’ దొంగ సర్వేలతో దుష్ప్రచారం చేస్తోందని సీఎం మండిపడ్డారు. గతంలో జూబ్లీహిల్స్‌లో ఇలాగే చెబితే జనం బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టారని గుర్తుచేశారు. తాను బీజేపీలోకి వెళ్లనని హరీష్ రావు చేత కేసీఆర్ ప్రమాణం చేయించగలరా అని ప్రశ్నించిన రేవంత్.. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత (సొంత చెల్లెలు) చెబుతోందని, ఆంధ్రా కాంట్రాక్టర్లు బీఆర్ఎస్‌కు వందల కోట్లు ఇచ్చారని కూడా ఆమే లీక్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమ పాలన.. మధిరకు ఇంజనీరింగ్ కాలేజ్!
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, రైతుబంధు వంటి పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసాను 12 వేలకు పెంచడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ రైతు రుణమాఫీ చేసి అన్నదాతలను రుణవిముక్తులను చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో 26 లోక్‌సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరిక మేరకు మధిర నియోజకవర్గానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.